భార్య చితి కోసం చిత్తుకాగితాలు, చెత్త..

5 Sep, 2016 09:40 IST|Sakshi
భార్య చితి కోసం చిత్తుకాగితాలు, చెత్త..

ఇండోర్: అంబులెన్స్ దారి మధ్యలోనే వదిలేయడంతో భార్య మృతదేహాన్ని 10 కిలోమీటర్ల దూరం భుజాన మోస్తూ తీసుకెళ్లిన ఒరిస్సాలోని ఓ వ్యక్తి ఉదంతం మరువక ముందే.. మధ్యప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది.

శ్మశానంలో భార్య మృతదేహానికి దహనసంస్కారాలు చేయడానికి పంచాయితీ పెద్దలు నిర్ణయించిన డబ్బు లేకపోవడంతో.. ఏం చేయాలో పాలుపోని ఆ భర్త, దహనానికి చుట్టుపక్కల చిత్తుకాగితాలు, చెత్త, పాతటైర్లు సేకరిస్తూ నరకం చూశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇండోర్కు 250 కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతం రతన్‌గర్ గ్రామంలో చోటుచేసుకుంది.

గత శుక్రవారం రతన్‌గర్ గ్రామ సమీపంలోని గిరిజన గ్రామంలో నోజీభాయ్ అనే మహిళ మృతి చెందింది. దీంతో ఆమె భర్త జగదీష్ దహనసంస్కాలు చేయడానికి రతన్‌గర్ శ్మశానవాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లాడు. రతన్గర్ పంచాయితీ పెద్దలు మాత్రం రూ. 2500 చెల్లిస్తేనే దహనసంస్కారాలకు అవకాశం అని తెగేసి చెప్పారు. తన దగ్గర అంత డబ్బులేదని జగదీష్ చెప్పినా వారు కనికరించలేదు. దీంతో ఏం చేయాలో తోచని జగదీష్.. సుమారు మూడు గంటల పాటు సమీపంలో దొరికిన వాటితో చితికి ఏర్పాట్లు చేసుకున్నాడు.

ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారిలో కొందరు శవాన్ని నదిలో పడేయమంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారని జగదీష్ వాపోయాడు. చివరకు గ్రామంలో ఓ వ్యక్తి కొంత కలపను సహాయం చేసినట్లు వెల్లడించాడు. ఈ ఘటన అధికారుల దృష్టికి వెళ్లడంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. రతన్గర్ గ్రామపెద్దలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు