నకిలీ సర్టిఫికెట్లతో బ్యాంకు కొలువులు

29 Mar, 2017 17:08 IST|Sakshi
న్యూఢిల్లీ: నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి దేశవ్యాప్తంగా 1,832 మంది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు తేలిందని కేంద్రం ప్రకటించింది. ఈ వివరాలను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు.
 
2010లో ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారం మొత్తం 1832 మందిలో సుమారు 1200 మంది బ్యాంకులు, బీమా సంస్థల్లో కొలువులు సంపాదించిన వారేనని బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.
 
నకిలీ పత్రాలు లేదా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు గుర్తించిన 1,832 కేసుల్లో 276 మందిపై సస్పెన్షన్‌ వేటు లేదా తొలగింపు, 521మందిపై కోర్టు కేసులు ఉండగా 1,035మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. కుల ధ్రువీకరణ నకిలీ పత్రాలతో 157 మంది ఎస్‌బీఐలో, 135 మంది సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో, 112 మంది ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో, 103 మంది సిండికేట్‌ బ్యాంక్ లోనూ పోస్టింగులు పొందారని చెప్పారు. ఇంకా న్యూ ఇండియా అష్యూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా అష్యూరెన్స్‌లో 41మంది చొప్పున ఉద్యోగాల్లో ఉన్నారని  జితేంద్ర సింగ్ వెల్లడించారు.
మరిన్ని వార్తలు