ఇసుక తుపాను, కుండపోత వర్షం : 79 మంది మృతి

3 May, 2018 09:56 IST|Sakshi
రాజస్థాన్‌లో పెను గాలుల దృశ్యం

జైపూర్‌, రాజస్థాన్‌ : ఈశాన్య రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో బుధవారం రాత్రి భారీ దుమ్ము తుపాను కల్లోలం సృష్టించింది. తుపాను ధాటికి ఇరు రాష్ట్రాల్లో 79 మంది ప్రాణాలు కోల్పోయారు. పెనుగాలులతో విరుచుకుపడిన దుమ్ము కారణంగా అల్వార్‌, ధోల్‌పూర్‌, భరత్‌పూర్‌ జిల్లాలో విద్యుత్‌ స్తంభించింది. పెనుగాలుల ధాటికి భారీ సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి.

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 47 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్క ఆగ్రా పరిసర ప్రాంతాల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లో ప్రకృతి బీభత్సానికి 32 మంది ప్రాణాలు వదలగా.. భరత్‌పూర్‌లో నష్ట తీవ్రత అధికంగా ఉంది. ఈ ఒక్క జిల్లాలో 11 మంది మృత్యువాత పడ్డారు.

తుపాను బారిన పడ్డ జిల్లాలో ప్రజలకు హుటాహుటిన సాయం అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే అధికారులను ఆదేశించారు. ప్రకృతి ప్రకోపానికి ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలకు ఆమె సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి కార్యాలయం, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు కూడా ప్రకృతి విలయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు