వివాదాస్పదంగా మారిన సదానంద గౌడ వ్యాఖ్యలు

26 May, 2020 11:14 IST|Sakshi

బెంగళూరు: కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ క్వారంటైన్‌కు వెల్లకపోవడం‌ పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. వివరాలు.. సోమవారం సదానంద గౌడ ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చారు. అయితే క్వారంటైన్‌కు వెళ్లేందుకు నిరాకరించారు. రసాయనాల శాఖ మంత్రి కావడంతో తనకు మినహాయింపు ఉందని తెలిపారు. కోవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి విమానాల్లో రాష్ట్రానికి వచ్చే వారికి క్వారంటైన్‌ తప్పని సరి అంటూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. కానీ సదానందగౌడ దీన్ని పట్టించుకోకుండా విమానాశ్రయం నుంచి అధికారిక వాహనంలో వెళ్లి పోయారు. (పాఠశాలల్లో క్వారంటైన్‌)

దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నియమాలు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.. మంత్రులకు కాదు అంటూ సోషల్‌మీడియా వేదికగా జనాలు విమర్శలు చేయడంతో సదానంద గౌడ దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మేము కరోనా కట్టడి కోసం పనిచేయాల్సి ఉంది. రసాయన శాఖ మంత్రిగా మందుల ఉత్పత్తి, సరఫరా సరిగా ఉందా.. లేదా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే కేంద్రం మాకు కొన్ని మినహాయింపుల ఇచ్చింది. మా ఇష్టం వచ్చినట్లు తిరిగితే.. ప్రధాని ఊరుకోరు. నా మొబైల్‌లో ఆరోగ్య సేతు యాప్‌ నేను సురక్షితంగా ఉన్నానని చెప్పింది. అందుకే క్వారంటైన్‌కు వెళ్లలేదు’ అన్నారు సదానంద గౌడ.(దెయ్యాల గ్రామాలే.. క్వారంటైన్‌ సెంటర్లు)

కర్ణాటక ప్రభుత్వం కూడా సదానందకు మద్దతు ఇచ్చింది. అత్యవసర విధులు నిర్వర్తించే వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వమే క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపింది. అంతేకాక ప్రభుత్వ విధుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు ప్రయాణించే మంత్రులకు, ఉద్యోగులకు క్వారంటైన్‌ అవసరం లేదు అంటూ ఈ నెల 23న కేంద్రం జారీ చేసిన ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌‌ ప్రొసిజర్‌’(ఎస్‌ఓపీ)ని ప్రజల దృష్టికి తీసుకు వచ్చింది.

 

>
మరిన్ని వార్తలు