ఈ-రిక్షాలపై 14 వరకూ నిషేధం

11 Aug, 2014 23:22 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజధాని నగర వీధుల్లో ఈ-రిక్షాలు తిరగకుండా విధించిన నిషేధం 14వ తేదీ వరకూ కొనసాగనుంది. ఈ-రిక్షాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడానికి ఢిల్లీ హైకోర్టు సోమవారం నిరాకరించింది. తదుపరి విచారణ జరిగే రోజున కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తామని జస్టిస్ బీడీ అహ్మద్, జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ-రిక్షాలను అక్టోబర్ 15వ తేదీ వరకూ అనుమతించేందుకు ఢిల్లీ రాష్ట్ర రవాణా విభాగం గుర్తింపు కార్డులను, తాత్కాలిక అనుమతిని మంజూరు చేస్తుందని కేంద్రం హైకోర్టుకు ప్రతిపాదించింది. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ తన వాదనలు వినిపిస్తూ, ఈ అంశం చాలా సున్నితమైందని, ఈ-రిక్షాలపై నిషేధం కారణంగా లక్షలాది మంది జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు.
 
 అయితే నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించిన ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనను ఒక అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. ధర్మాసనం సూచనల మేరకు కేంద్రం ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ‘‘ఈ-రిక్షా ఆపరేటర్లకు అవసరమైన వాణిజ్య డ్రైవింగ్ లెసైన్సులు మంజూరు చేసేందుకు గాను నగరమంతటా కేంద్రాలు ప్రారంభించి, అదనపు గంటలు కూడా పని చేసేందుకు రాష్ట్ర రవాణా విభాగం అంగీకరించింది’’ అని కేంద్రం తన అఫిడవిట్‌లో తెలిపింది. ‘‘ఈ-రిక్షా అసోసియేషన్లు తీవ్రమైన గాయాలు, లేదా మరణాల సందర్భంగా పొందేందుకు రూ.10 లక్షల వరకు బీమా సంచయను కూడా తయారు చేసుకోవచ్చు’’ అని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ-రిక్షాల కారణంగా తీవ్రమైన గాయాలైన వారికి రూ.25 వేలు, మరణాలు సంభవిస్తే మృతుని కుటుంబానికి లక్ష వరకు పరిహారం చెల్లించవచ్చునంది. డ్రైవర్లకు లెసైన్సులు లేకుండా ఈ-రిక్షాలకు రిజిస్ట్రేషన్, బీమా సదుపాయం లేకుండా వాటిని తిరిగేందుకు అనుమతించబోమని హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెల్సిందే.

మరిన్ని వార్తలు