అదృశ్యమవుతున్న ‘డిజిటల్‌ వాలెట్స్‌’

23 Nov, 2018 12:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ‘డిజిటల్‌ వాలెట్ల’ వ్యాప్తికి దాదాపు తెరపడినట్లేనా? పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ‘డిజిటల్‌ ఇండియా’ స్ఫూర్తితో డిజిటల్‌ వాలెట్లు పురోగమించడం మానేసి తిరోగమించడం ఆశ్చర్యకరం.  2006లో ఒకే ఒక్క డిజిటల్‌ వాలెట్‌ ఉండగా, 2017 నాటికి వాటి సంఖ్య 60కి చేరుకున్నాయి. వివిధ కారణాల వల్ల ఇప్పుడు వాటి సంఖ్య 49కి పడిపోయాయని భారతీయ రిజర్వ్‌ బ్యాంకు తెలియజేసింది. డిజిటల్‌ మార్కెట్‌ వ్యవస్థ స్థిరీకరణకు చేరుకోకపోవడం, పోటీ తత్వం పెరగడం, లాభాలు లేక పోవడంతోపాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలు సానుకూలంగా లేకపోవడమే ఈ మార్కెట్‌ పతనానికి కారణమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా చిన్న, మధ్య తరహా కంపెనీలు మూసుకుపోగా పెద్ద కంపెనీలు మనుగడ కోసం పోరాటం సాగిస్తున్నాయని అ వర్గాలు అంటున్నాయి.

తొలి డిజిటల్‌ వాలెట్‌ ‘వాలెట్‌ 365. కామ్‌’
ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్‌ గ్రూపు ‘ఎస్‌ బ్యాంక్‌’తో కలిసి ఈ వాలెట్‌ను 2006లో తీసుకొచ్చింది. ఆ తర్వాత పలు బ్యాంకులు, పలు బ్యాంకేతర ఆర్థిక సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. బిగ్‌బాస్కెట్, గోవర్స్‌ అనే రిటేల్‌ సంస్థలు, అమెజాన్‌ లాంటి ఆన్‌లైన్‌ సంస్థలు, ప్రముఖ మెస్సేజింగ్‌ సంస్థ ‘వాట్సాప్‌’లు ఈ రంగంలోకి ప్రవేశించాయి. పేటీఎం, మోబిక్విక్‌ లాంటి డిజిటల్‌ వాలెట్‌ సంస్థలు మార్కెట్‌లో మంచి వాటాలను కూడా సంపాదించుకున్నాయి. స్మార్ట్‌ఫోన్ల విప్లవం ఈ మార్కెట్‌ను ముందుగా ప్రోత్సహించాయి. ఆ తర్వాత 2016 నవంబర్‌ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఈ మార్కెట్‌కు మంచి ఊపు వచ్చింది. 2015–2016 సంవత్సరంలోనే ఈ మార్కెట్‌ 154 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2021–2022 సంవత్సరానికి ఈ మార్కెట్‌ దేశంలో 30 వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఈ వాలెట్‌ పరిశ్రమ ఆశించింది. 

పతనం ప్రారంభం
‘చెల్లింపులేవో పెద్ద మొత్తాల్లో జరపాల్సి రావడం, వ్యాపారమేమో చాలా తక్కువగా ఉండడం వల్ల చిన్న కంపెనీలు నిలదొక్కుకోలేక మూతపడ్డాయి. పెద్ద కంపెనీలు ఇప్పటికీ క్లిష్ట పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి’ అని మోబిక్విక్‌ సహ వ్యవస్థాపకులు ఉపాసన తెలిపారు. ‘విస్తత స్థాయి కస్టమర్‌ నెట్‌వర్క్‌ లేకపోయినట్లయితే డబ్బులను తగలేసుకోవడం తప్ప, స్థిరత్వం ఎలా సాధించగలం’ అని మొబైల్‌ వాలెట్‌ ‘టీఎండబ్లూ’ వ్యవస్థాపకుడు వినయ్‌ కలాంత్రి చెప్పారు. పెద్ద కంపెనీలకు లాభాలు లేకపోవడంతో చిన్న కంపెనీల నెట్‌వర్క్‌లను కొనుక్కోవాల్సి వస్తోందని, అందుకనే ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘ట్రూపే’ను తాము కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ కారణంగానే గత రెండేళ్లలో పలు పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలను కొనుగోలు చేశాయి. మొబైల్‌ ‘ఫర్మ్‌ ఫ్రీచార్జ్‌’ని ఆక్సిస్‌ బ్యాంక్, ఆన్‌లైన్‌ పేమెంట్‌ సంస్థ ‘ఎమ్వాంటేజ్‌’ను అమెజాన్, ‘ఫోన్‌పే’ను ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీ, ఆఫ్‌లైన్‌ స్టోర్ల మొబైల్‌ వాలెట్‌ ‘మొమో’ను షాప్‌క్లూస్‌ కంపెనీలు కొనేశాయి. 

ఆర్‌బీఐ కొత్త రూల్‌ వల్ల కూడా
డిజిటల్‌ వాలెట్‌ కంపెనీలు ఎల్లప్పుడు రెండు కోట్ల రూపాయల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలనే నిబంధనను ఐదు కోట్ల రూపాయలకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ పెంచడం, మూడేళ్ల మొత్తానికి నెట్‌వర్త్‌ 15 కోట్ల రూపాయలు ఉండాలనే నిబంధన తేవడం వల్ల చాలా కంపెనీలు వెనకడుగు వేశాయి. ఇప్పటికే లైసెన్స్‌లు తీసుకున్న కంపెనీలు కూడా తమ డిజిటల్‌ వ్యాపారాన్ని ప్రారంభించలేదు. అక్రమ చెల్లింపులు జరుగకుండా ‘నో యువర్‌ కస్టమర్‌’ కింద స్పష్టమైన వెరిఫికేషన్‌ ఉండాలనడం, అందుకోసం అదనపు డాక్యుమెంట్లు అవసరం అవడం కూడా డిజిటల్‌ వాలెట్‌ కంపెనీలను నిరుత్సాహ పరిచాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. 

సుప్రీంకోర్టు తీర్పు వల్ల కూడా
సరకుల మార్పిడీ లేదా సర్వీసుల కోసం కార్పొరేట్‌ కంపెనీలు లేదా వ్యక్తులు ఆధార్‌ కార్డుల సమాచారాన్ని కోరరాదని సుప్రీం కోర్టు గత సెప్టెంబర్‌ నెలలో ఉత్తర్వులు జారీ చేయడం కూడా ఈ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ‘నో యువర్‌ కస్టమర్‌’ ప్రక్రియ క్లిష్టమైనప్పటికీ ఆధార్‌ కార్డుల ద్వారా అందులో ఉండే బయోమెట్రిక్‌ ముద్రలను తీసుకొని వినియోగదారులను సులభంగానే గుర్తుపట్టే వాళ్లమని, ఆధార్‌ కార్డు డేటాను ఉపయోగించ కూడదని సుప్రీం కోర్టు ఉత్తర్వులతో పెద్ద కంపెనీలకు కూడా ‘నో యువర్‌ కస్టమర్‌’ ప్రక్రియను అమలు చేయడం కష్టమైపోయిందని మరో వాలెట్‌ కంపెనీ ‘పేవరల్డ్‌’ కంపెనీ సీఈవో ప్రవీణ్‌ దాదాభాయ్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు