నాశనం చేయడం సులభం; సీజేఐ మిశ్రా

16 Aug, 2018 03:21 IST|Sakshi

వ్యవస్థ పనిచేసేలా మార్చడమే కష్టం

న్యూఢిల్లీ: ‘ఓ వ్యవస్థను విమర్శించడం, దానిపై దాడులు చేయడం, నాశనం చేయడం చాలా సులభం. కానీ ఆ వ్యవస్థ పనిచేసేలా మార్చ డం సవాళ్లతో కూడుకున్న కష్టమైన పని’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ దీపక్‌ మిశ్రా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జస్టిస్‌ మిశ్రా మాట్లాడారు. వ్యవస్థలోని వ్యక్తులు తమ వ్యక్తిగత కోర్కెలు, లక్ష్యాలను అధిగమించి సానుకూల దృక్పథంతో, హేతుబద్ధతతో, పరిణతి, బాధ్యతలతో నిర్మాణాత్మక చర్యలు చేపట్టినప్పుడే వ్యవస్థ మరింత ఉన్నత స్థానానికి చేరుతుందని అన్నారు. ‘న్యాయవ్యవస్థను బలహీన పరిచేందుకు కొన్ని శక్తులు పనిచేస్తుండొచ్చు. మనమంతా కలసి వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి’ అని పేర్కొన్నారు.

న్యాయ దేవత చేతిలోని త్రాసు సమన్యాయాన్ని సూచిస్తుందనీ, ఆ సమానత్వానికి భంగం కలిగించే ఎవరైనా ఆ దేవతను బాధ పెట్టినట్లేనని జస్టిస్‌ మిశ్రా అన్నారు. న్యాయ దేవత కన్నీరు కార్చేందుకు తాము ఒప్పుకోమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రజాహిత వ్యాజ్యాల (పిల్‌) విస్తృతి దెబ్బతినకుండా ఉండాలంటే కొంత పరిశీలన తప్పనిసరన్నారు. తక్కువ విస్తృతి కలిగిన అంశాలపై పిల్‌ వేసేందుకు చెల్లించాల్సిన రుసుమును సుప్రీంకోర్టు ఇటీవల భారీగా పెంచడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్, సర్దార్‌ పటేల్‌ తదితర గొప్పవాళ్ల గుర్తుగా ఉన్న ప్రదేశాలను సందర్శించినప్పుడు వారిని పొగడాలని రవి శంకర్‌ కోరగా, జస్టిస్‌ మిశ్రా మాట్లాడుతూ ‘వారంతా దేశం కోసం పోరాడారు. మన పొగడ్తల కోసం కాదు’ అని అన్నారు.  

మరిన్ని వార్తలు