మోదీ వ్యాఖ్యలపై  ‘సుప్రీం’కు కాంగ్రెస్‌

8 May, 2019 03:26 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అవినీతిలో నంబర్‌ వన్‌ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతవారం ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రధాని ఈవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఎన్నికల కమిషన్‌(ఈసీ)కు కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. రాజీవ్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోదీతోపాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు ఈసీ క్లిన్‌చిట్‌ ఇచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సుస్మిత దేవ్‌ మరోసారి సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేశారు.

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి చెడు సంప్రదాయానికి ఒడిగట్టినవారిగా మోదీ, అమిత్‌ షాను ప్రకటించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు. వారికి ఈసీ క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు ఉన్న రికార్డులను తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు పిటిషన్‌దారుకు సూచించింది. ఇటీవల ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ చీఫ్‌ మాయావతి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఎస్పీ నేత ఆజంఖాన్‌లపై ఈసీ చర్యలు తీసుకున్న విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టుకు గుర్తు చేసింది. 

మరిన్ని వార్తలు