సెప్టెంబర్‌లోనే..అసెంబ్లీ ఎన్నికలు

16 Jul, 2014 23:15 IST|Sakshi

సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలను సెప్టెంబర్‌లో ప్రారంభించి, అక్టోబర్ మూడో వారంలోగా పూర్తిచేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించింది. ఈ నెల 31న ఓటర్ల తుది జాబితా విడుదలచేసి ఆగస్టు ఐదో తేదీలోగా రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్)ని అమలులోకి తేవాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల సమావేశంలో ఆమోద ముద్రవేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే శాసనసభ ఎన్నికల గురించి ఆరా తీసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్లు వి.ఎస్.సంపత్, బ్రహ్మే, ఝులీ తదితరులు ముంబై పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎన్నికల అధికారులను ముంబైకి ఆహ్వానించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, చేపట్టాల్సిన ఏర్పాట్లపై సుదీర్గ చర్చలు జరిపారు.

 కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను ఈ నెల 15 లోపు పూర్తిచేయాలని ఇదివరకే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఆ మేరకు ప్రస్తుతం 90 శాతానిపైగా డేటా ఎంట్రీ పనులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరు వరకు తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఆగస్టు ఐదో తేదీలోపు ఎన్నికల కోడ్ జారీచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఆగస్టు 15-20వ తేదీలోపు ఎన్నికల షెడ్యూలు విడుదల చేసి సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 15 వరకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి అదనంగా పోలీసు బలగాలను రప్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముంబై రీజియన్‌లో ఉన్న ముంబై, ఠాణే, రాయ్‌గఢ్ ప్రాంతాల్లో ఎన్నికలకు సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయి. కేవలం వసయి, నాలాసొపార ప్రాంతాల్లో ఓటర్ల పేర్ల డాటా ఎంట్రీ పనులు మిగిలిపోయాయి. అవి కూడా త్వరలో పూర్తికానున్నాయి. త్వరలో జరగనున్న తుది సమావేశంలో ఎన్నికలు కచ్చితంగా ఎప్పుడు నిర్వహించాలి...? ఎన్నికల కోడ్ ఎప్పటి నుంచి అమలు చేయాలి..? అనే అంశాలపై ఆమోద ముద్రవేస్తారు. ఆ తర్వాత ఎన్నికల నామినేషన్లు దాఖలు, ఉపసంహరణ, ఎన్నికల గుర్తులు తదితర విషయాలతో సమగ్ర షెడ్యూల్ విడుదలవుతుందని అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు