వెల్లూరులో ఎన్నికల రద్దుపై స్పందించిన ఈసీ

16 Apr, 2019 12:43 IST|Sakshi

న్యూఢిల్లీ: తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికలను రద్దు వేస్తున్నట్టు వస్తున్న వార్తలో నిజం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో భారీగా నగదు పట్టుబడటంతో ఈసీ ఎన్నికలను రద్దు చేయనుందనే వార్తలు వచ్చాయి. దీనిపై ఎన్నికల కమిషన్‌ అధికార ప్రతినిధి ఎస్‌ శరణ్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నికల సంఘం అలాంటి ఉత్తర్వులు జరీ చేయలేదని వెల్లడించారు.

ఇటీవల తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా వెల్లూరు పార్లమెంట్‌ డీఎంకే అభ్యర్థి కదిర్‌ ఆనంద్‌ కార్యలయం నుంచి భారీగా నగదు పట్టుబడింది. దీంతో అతనిపై జిల్లా అధికారులు కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్లపై డబ్బు ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ఈసీ వెల్లూరులో ఎన్నిక రద్దు చేయనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. కాగా, సార్వత్రిక ఎన్నికల రెండో దశలో భాగంగా తమిళనాడులోని  అన్ని పార్లమెంట్‌ స్థానాలకు ఏప్రిల్‌ 18న పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే.  

>
మరిన్ని వార్తలు