ఉపాధికి మరో 40 వేల కోట్లు

18 May, 2020 02:35 IST|Sakshi

రాష్ట్రాల రుణపరిమితి 3 నుంచి 5 శాతానికి పెంపు

ప్రజారోగ్యానికి నిధులను పెంచుతాం

గ్రామ స్థాయికి వైద్య సేవలు

త్వరలో కొత్త జాతీయ కరిక్యులమ్‌

ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ప్రకటించిన ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి భారత్‌ లక్ష్యంగా, దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే దిశగా ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో చిట్టచివరి వివరాలను ఐదోరోజు ఆదివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఉపాధి హామీ, వైద్యారోగ్యం, విద్య తదితర రంగాలపై ఈ రోజు దృష్టి పెట్టినట్లు వివరించారు. సొంతూళ్లకు వెళ్తున్న వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 40 వేల కోట్లను అదనంగా కేటాయించామన్నారు.

‘బడ్జెట్లో ప్రకటించిన రూ. 61 వేల కోట్లకు ఇది అదనం. ఈ మొత్తంతో 300 కోట్ల పని దినాలను సృష్టించవచ్చు’అని నిర్మల చెప్పారు. ఐదు విడతలుగా తాము ప్రకటించిన ప్యాకేజీ మొత్తం విలువ రూ. 20.97 లక్షల కోట్లని తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన రూ. 8.01 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ఇందులో భాగమేనన్నారు. అయితే, ఇందులో ప్రభుత్వం నికరంగా చేసే ఖర్చు ఎంతో వివరించేందుకు ఆమె నిరాకరించారు.

కానీ, ఉపాధి హామీ పథకంలో పెంపుదల, ఉచిత ఆహార ధాన్యాలు, కొన్ని వర్గాలకు పన్ను రాయితీలు, కరోనాపై పోరు కోసం వైద్యారోగ్య రంగానికి కేటాయించిన రూ. 15 వేల కోట్లు మొదలైన వాటితో కలిపి నికర ప్రభుత్వ ఖర్చు సుమారు రూ. 2.1 లక్షల కోట్లు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఐదు విడతలుగా తెలిపిన ప్యాకేజీలో ఎంఎస్‌ఎంఈ, వీధి వ్యాపారులు, రైతులు, వలస కూలీలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని వారు.. తదితరాలకు పలు ఉపశమన చర్యలను ప్రకటించారు.  

అంటువ్యాధుల ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు
► పీఎం కిసాన్‌ పథకం కింద ఈ లాక్‌డౌన్‌ కాలంలో దేశవ్యాప్తంగా 8.19 కోట్ల మంది రైతులకు రూ. 2 వేల చొప్పున 16,394 కోట్ల రూపాయలను అందించాం. మహిళల జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.10,025 కోట్లను జమ చేశాం.  

► ప్రజారోగ్య రంగానికి నిధుల వాటా పెంచాలని నిర్ణయించాం. క్షేత్రస్థాయి వైద్య కేంద్రాల్లో పెట్టుబడులను పెంచుతాం. అన్ని ఆసుపత్రుల్లో అంటువ్యాధుల ప్రత్యేక కేంద్రాలను, తాలూకా స్థాయి వరకు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లోనూ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తాం.  

► కరోనాపై పోరు కోసం కేంద్రం ప్రకటించిన రూ. 15 వేల కోట్లలో రూ. 4,113 కోట్లను ఆరోగ్య శాఖ ఇప్పటికే విడుదల చేసింది.

‘పీఎం ఈ– విద్య’

► డిజిటల్, ఆన్‌లైన్‌ విద్యకు సంబంధించి ‘పీఎం ఈ– విద్య’పేరుతో ఒక బహుముఖ కార్యక్రమాన్ని అతిత్వరలో ప్రారంభిస్తాం. ఇందులో భాగంగా, అలాగే, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, ప్రతీ తరగతికి ఒక ప్రత్యేక చానెల్‌ ఉంటుంది. మే 30 నుంచి ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభించుకునేందుకు 100 అత్యున్నత విద్యాసంస్థలకు అనుమతిస్తున్నాము. పాఠశాల విద్యలో ‘డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ నాలెడ్జ్‌ షేరింగ్‌ (దీక్ష)’ను విస్తృతంగా ఉపయోగిస్తాం. విద్యార్థులు, ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

► భవిష్యత్తులో అవసరమైన నైపుణ్యాల సముపార్జనకు ఉపయోగపడేలా త్వరలో జాతీయ స్థాయిలో కొత్త కరిక్యులమ్‌ విధానాన్ని ప్రారంభిస్తాం. డిసెంబర్‌ నాటికి ‘నేషనల్‌ ఫౌండేషనల్‌ లిటరసీ, న్యూమరసీ మిషన్‌’ను ప్రారంభిస్తాం. లాక్‌డౌన్‌ కారణంగా విద్యార్థుల్లో ఉత్పన్నమవుతున్న మానసిక సమస్యల పరిష్కారానికి ‘మనోదర్పణ్‌’ కార్యక్రమాన్ని రూపొందించాము.

5 శాతానికి రాష్ట్రాల రుణ పరిమితి.. షరతులు వర్తిస్తాయి
రాష్ట్రాల రుణ పరిమితి ఆ రాష్ట్ర జీడీపీలో 3% వరకు ఉండగా, దాన్ని 2020–21 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. తద్వారా రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. అయితే, ఇందుకు రాష్ట్రాలు ‘ఒక దేశం– ఒక రేషన్‌ కార్డ్‌’, ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’, ‘విద్యుత్‌ సరఫరా’, ‘పట్టణ స్థానిక సంస్థల ఆదాయం’ మొదలైన 4 అంశాల్లో సంస్కరణలను అమలు చేయాల్సి ఉంటుందన్నారు.  ప్రస్తుతం ఉన్న 3% పరిమితి ప్రకారం రాష్ట్రాలకు రూ. 6.41 లక్షల కోట్ల వరకు నికర రుణ పరిమితి ఉంది. ఈ పరిమితిని పెంచాలంటూ ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు ప్రధానికి లేఖలు రాశారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రుణ పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు నిర్మల తెలిపారు. ‘3% నుంచి 3.5% వరకు షరతులు ఉండవు. 3.5% నుంచి 4.5% వరకు పరిమితి పెంపు 4 విడతలుగా 0.25% చొప్పున, సంస్కరణల అమలుకు సంబంధించిన షరతుల అమలుపై ఆధారపడి ఉంటుంది. కనీసం మూడు సంస్కరణల అమలును విజయవంతంగా పూర్తి చేసినప్పుడు మిగతా 0.5% పెంపు ఉంటుంది’అని ఆమె వివరించారు.  ‘3%లో 75% రుణంగా పొందేందుకు కేంద్రం రాష్ట్రాలకు అనుమతివ్వగా రాష్ట్రాలు అందులో 14% మాత్రమే అప్పుగా పొందాయి. మిగతా 86% నిధులు నిరుపయోగంగానే ఉన్నాయి’అని మంత్రి నిర్మల తెలిపారు.

మరిన్ని వార్తలు