అగస్టా కేసులో ఈడీ మరో చార్జిషీటు

5 Apr, 2019 04:52 IST|Sakshi

న్యూఢిల్లీ: అగస్టావెస్ట్‌ల్యాండ్‌ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టయిన మధ్యవర్తి క్రిస్టియన్‌ మిషెల్, తదితరులు రూ.300 కోట్ల మేర లబ్ధి పొందారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పేర్కొంది. 3వేల పేజీల రెండో చార్జిషీటును గురువారం ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఈ చార్జిషీటులో మిషెల్‌ వ్యాపార భాగస్వామి డేవిడ్‌ సిమ్స్‌నూ చేర్చింది. వీరిద్దరూ గ్లోబల్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్, గ్లోబల్‌ సర్వీసెస్‌ ఎఫ్‌జెడ్‌ఈ అనే సంస్థలు నడుపుతున్నారు. భారత ప్రభుత్వం, ఇటలీలో ఉన్న బ్రిటిష్‌ కంపెనీ అగస్టావెస్ట్‌ల్యాండ్‌తో 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా మిషెల్, సిమ్స్‌ తదితరులు ఈ సొమ్మును పొందారని ఈడీ పేర్కొంది. ఆ రూ.300 కోట్ల సొమ్ము అగస్టా సంస్థే గ్లోబల్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్, గ్లోబల్‌ సర్వీసెస్‌లకు చెల్లించిందని ఆరోపించింది. ఈడీ తాజా చార్జిషీటును పరిగణనలోకి తీసుకోవాలో వద్దో ఈ నెల 6వ తేదీన ప్రకటిస్తానని స్పెషల్‌ జడ్జి తెలిపారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం కేసుకు సంబంధించి మిషెల్, ఇతర మధ్యవర్తులు రూ.225 కోట్ల మేర లబ్ధి పొందారని 2016లో న్యాయస్థానానికి సమర్పించిన మొదటి చార్జిషీటులో ఈడీ పేర్కొంది.

మరిన్ని వార్తలు