ఇక ఈడీ కస్టడీకి చిదంబరం!

16 Oct, 2019 03:09 IST|Sakshi
చిదంబరాన్ని కోర్టుకు తరలిస్తున్న దృశ్యం

అరెస్ట్‌ చేసేందుకు అనుమతించిన ప్రత్యేక కోర్టు

నేడు తీహార్‌ జైల్లో్ల మాజీ కేంద్రమంత్రిని విచారించనున్న ఈడీ

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులోని నగదు అక్రమ చలామణికి సంబంధించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న చిదంబరంను విచారించేందుకు, అవసరమైతే అరెస్ట్‌ చేసేందుకు ఈడీకి స్థానిక కోర్టు మంగళవారం అనుమతి మంజూరు చేసింది. చిదంబరంను బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి విచారించేందుకు జైల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్‌ కుమార్‌ కుహార్‌ ఆదేశించారు.

55 రోజులుగా, ఆగస్టు 21 నుంచి, సీబీఐ, జ్యుడీషియల్‌ కస్టడీల్లోనే చిదంబరం ఉన్న విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఆయన జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుంది. కోర్టు ఆవరణలోనే చిదంబరంను ప్రశ్నించేందుకు అనుమతివ్వాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అమిత్‌ మహాజన్‌ కోర్టును కోరారు.  అయితే, ఆయన గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని, బహిరంగంగా విచారించడం, అరెస్ట్‌ చేయడం సరికాదని జడ్జి తెలిపారు.

సీబీఐ నన్ను అవమానిస్తోంది: చిదంబరం 
ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసుకు సంబంధించి సీబీఐ విచారిస్తున్న మరో కేసులో నిందితుడిగా తీహార్‌ జైల్లో ఉన్న చిదంబరం మంగళవారం సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనను అవమానపరిచేందుకే సీబీఐ కస్టడీ కోరుతోందని ఆరోపించారు. చిదంబరం తరఫున సీనియర్‌ అడ్వొకేట్లు కపిల్‌ సిబల్, అభిషేక్‌ మను సింఘ్విలు వాదించారు.

జస్టిస్‌ ఆర్‌ బానుమతి నేతృత్వంలో సుప్రీం బెంచ్‌ ఎదుట వాదనలు వినిపించిన లాయర్లు ఈ కేసులో అంశాలన్నీ చిదంబరానికే అనుకూలంగా ఉన్నప్పటికీ ఢిల్లీ హైకోర్టు బెయిల్‌  ఇవ్వడానికి నిరాకరించిందన్నారు.  చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ను గతంలో ఢిల్లీ హైకోర్టు విచారించినప్పుడు మూడు అంశాలపైనే సీబీఐ పదే పదే వాదించింది.  అయితే విదేశాలకు వెళ్లిపోవడం, సాక్ష్యాలను తారుమారు చేస్తారు అనే విషయాల్లో సీబీఐ వ్యక్తం చేసిన అనుమానాలను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు