ఫెమా ఉల్లంఘనలపై ఎన్‌డీటీవీకి ఈడీ నోటీసులు

18 Oct, 2018 20:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ మారక ద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఎన్‌డీటీవీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం నోటీసులు జారీ చేసింది. ఎన్‌డీటీవీకి అందిన రూ 1637 కోట్ల విదేశీ పెట్టుబడులు, మరో రూ 2732 కోట్ల విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఫెమా ఉల్లంఘనలకు పాల్పడినట్టు తమ విచారణలో వెల్లడైందని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఫెమా చట్టంకింద ఎన్‌డీటీవీ వ్యవస్ధాపకులు, ఎగ్జిక్యూటివ్‌ కో చైర్‌పర్సన్స్‌ ప్రణయ్‌ రాయ్‌, రాధికా రాయ్‌, జర్నలిస్ట్‌ విక్రమ చంద్ర సహా ఇతరులకు షోకాజ్‌ నోటీసు జారీ చేశామని ఈడీ తెలిపింది. ఎన్‌డీటీవీ సమీకరించిన విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఆయా నివేదికలు, సమాచారాన్ని ఆర్‌బీఐ ముందుంచడంలో జాప్యాలను నోటీసులో ఈడీ ప్రస్తావించింది. మరోవైపు రూ 600 కోట్లు మించిన ఎఫ్‌డీఐకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర అవసరమని, ఈ అనుమతి లేకుండానే ఎన్‌డీటీవీ గ్రూప్‌ రూ 725 కోట్ల ఎఫ్‌డీఐ సమీకరించిందని ఈడీ ఆరోపించింది. రూ 600 కోట్లకు తక్కువగా ఎఫ్‌డీఐని చూపడం భారీ కుట్రలో భాగమని ఈడీ ఆరోపించింది.

>
మరిన్ని వార్తలు