డేగ కన్ను.. షార్ప్ షూటర్స్.. షట్ డౌన్

7 Nov, 2015 09:28 IST|Sakshi
డేగ కన్ను.. షార్ప్ షూటర్స్.. షట్ డౌన్

శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో అన్ని రకాల భద్రతా బలగాల బూట్ల చప్పుళ్లు వినిపిస్తున్నాయి.. ప్రధాని నరేంద్రమోదీ శనివారం జమ్మూకశ్మీర్ లోయలో పర్యటించి ఓ ర్యాలీలో పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసు బలగాలు కేంద్ర బలగాలు, మిలటరీ పకడ్బందీ రక్షణ చర్యల్లో మునిగిపోయింది. ప్రధాని పర్యటన ప్రశాంతంగా సాగేందుకు అనుగుణంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. పలు చోట్ల ఆంక్షలు విధించింది. ముఖ్యంగా తిరుగుబాటుదారులు ఉన్న ప్రాంతాలపై డేగ కన్ను ఉంచింది. నిరసనలు ఎదురవకుండా, నల్ల జెండాలవంటి ప్రదర్శనవంటి కార్యక్రమాలకు అవకాశం లేకుండా శరవేగంగా చర్యలు పూర్తి చేసింది.

దీంతోపాటు ప్రధాని షేర్ ఈ కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్న సభలో ప్రధాని పాల్గొననున్న నేపథ్యంలో ఆ వైపు వచ్చే రహదారులన్నింటిపై గట్టి నిఘా ఏర్పాటుచేసి ఆంక్షలు విధించింది. అనుమానిత వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేలా సీసీటీవీల ఏర్పాటుతోపాటు మొత్తం మూడు కిలోమీటర్ల దూరంమేరకు ఉన్న ఎత్తయిన భవంతులపై షార్ప్ షూటర్స్ ను కూడా సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే వందలమందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు ఇతర వ్యాపార సంస్థలు మూసి వేశారు. మూడు రోజులుగా తక్కువమంది ప్రజలు మాత్రమే సభ నిర్వహించే ప్రాంతాల్లో తిరిగేందుకు అనుమతిస్తుండగా శనివారం పూర్తిగా ఆ ప్రాంతంలో నిషేధం విధించారు.

>
మరిన్ని వార్తలు