వృద్ధుడిని సర్‌ప్రైజ్‌ చేసిన పోలీసులు

28 Apr, 2020 17:09 IST|Sakshi

చండీగఢ్‌: లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమై.. ఒంటరిగా జీవిస్తున్న ఓ వృద్ధుడిని పోలీసులు సర్‌ప్రైజ్‌ చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కేకు తీసుకువెళ్లి ఆనందంలో ముంచెత్తారు. ఊహించని పరిణామానికి ఆశ్చర్యచకితుడైన సదరు వృద్ధుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను పంకజ్‌ నైన్‌ అనే ఐపీఎస్‌ ఆఫీసర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. (హాట్సాఫ్‌! మహిళా పోలీసుల కొత్త అవతారం)

ఆ వీడియో ప్రకారం.. పంచకుల మహిళా పోలీసులు గేటు మూసి ఉన్న ఓ ఇంటి వద్దకు వెళ్లారు. లోపల ఎవరు ఉన్నారని ప్రశ్నించగా... ‘‘నా పేరు కరణ్‌ పురి. సీనియర్‌ సిటిజన్‌ను. ఇంట్లో ఒక్కడినే ఉంటున్నా’’అని ఓ వ్యక్తి బయటకు వచ్చారు. ఇంతలో కేకు బయటకు తీసిన పోలీసులు.. హ్యాపీ బర్త్‌డే అంటూ ఆయనను విష్‌ చేశారు. ‘‘మేము కూడా మీ కుటుంబ సభ్యుల వంటి వాళ్లమేనని’’ ధైర్యం చెప్పారు. దీంతో కన్నీటిపర్యంతమైన కరణ్‌ పురి... ఆనందభాష్పాలతో కేక్‌ను కట్‌ చేశాడు. లాక్‌డౌన్‌లో ఒంటరితనంతో బాధ పడుతున్న తనను ఇలా సంతోషపెట్టిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసుల చర్యను అభినందిస్తున్నారు. అందరిలోనూ ఇలా సానుకూల దృక్పథం నింపుతూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు.(కరోనా: పోలీసులపై రాళ్లదాడి.. గాల్లోకి కాల్పులు)

మరిన్ని వార్తలు