5 రాష్ట్రాల్లో మోగిన ‘అసెంబ్లీ’ నగారా

5 Mar, 2016 07:50 IST|Sakshi
5 రాష్ట్రాల్లో మోగిన ‘అసెంబ్లీ’ నగారా

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల నగారా మోగింది. వివిధ దశల్లో ఏప్రిల్ 4 నుంచి మే 16వరకు 43 రోజుల్లో ఈ తతంగం పూర్తి చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ వెల్లడించారు. తమిళనాడు (234), కేరళ (140), పుదుచ్చేరి (30)లో మే 16న ఒకే దశలో అన్ని సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అస్సాం(140)లో 2 దశల్లో, పశ్చిమబెంగాల్ (294)లో ఆరు దశల్లో పోలింగ్ నిర్వహిస్తామని జైదీ తెలిపారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పందం కారణంగా.. పశ్చిమబెంగాల్‌లో కూచ్ బెహార్ జిల్లాలో కొత్తగా చేర్చిన 16వేల మందికి ఓటుహక్కు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఈ ప్రాంతంలోచివరి దశలో ఎన్నికలు నిర్వహించనున్నామని.. అదే విధంగా వామపక్ష తీవ్రవాద ప్రభావమున్న ప్రాంతాల్లో తొలిదశలో ఎన్నికలు పూర్తిచేయనున్నట్లు జైదీ వెల్లడించారు.

కేరళలో ఓటర్ లిస్టులో అక్రమాలపై మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధునాతన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తామని తెలిపారు. మే 16న అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత.. మే 19న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అస్సాం, కేరళల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ఈ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు వివిధ ప్రాంతీయపార్టీలతో పొత్తుపెట్టుకుని ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో కీలక శక్తిగా ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోండగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో తొలిసారిగా నోటాకు ఓ గుర్తును కేటాయించనున్నట్లు జైదీ తెలిపారు. దీన్ని అభ్యర్థుల జాబితాలో చివరన పొందుపరుస్తామన్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 1.18 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17కోట్ల ఓటర్లు  తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

 ఒంటరిపోరే: మమత
 పశ్చిమబెంగాల్లో ఒంటరిపోరు చేయనున్నట్లు టీఎంసీ అధినేత్రి మమతా వెల్లడించారు. ఈసీ పోలింగ్ తేదీలను వెల్లడించగానే.. మమత కూడా 294 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. గతంలో 31గా ఉన్న మహిళా అభ్యర్థుల సంఖ్యను 45కు (15%) మైనార్టీల సంఖ్యను 38 నుంచి 57కు పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో జైలుకు వెళ్లిన రవాణా మంత్రి మదన్ మిత్రా కూడా పోటీ చేస్తారని మమత తెలిపారు.
 

మరిన్ని వార్తలు