మూణ్నెళ్ల అనంతరం ఈసీ ప్రత్యక్ష భేటీ

1 Jun, 2020 17:22 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం దాదాపు మూడు నెలల అనంతరం పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా భేటీ అయింది. ప్రధాన ఎన్నికల అధికారి, ఇద్దరు కమిషనర్లు భారత ఎన్నికల సంఘం కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. మార్చి నెలలో అమెరికా వెళ్లిన సీఈసీ సునీల్‌ అరోరా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. దాంతో వీడియో కాన్ఫరెన్స్‌లతోనే ఇన్ని రోజులు ఎన్నికల సంఘం సమావేశమైంది.

ఇటీవలే భారత్‌కు తిరిగొచ్చిన సునీల్‌ అరోరా.. స్వీయ నిర్బంధం పూర్తయిన అనంతరం తాజా సమావేశానికి హాజరయ్యారు. సీఈసీ అమెరికాలో ఉన్న సమయంలోనే మహారాష్ట్రలో మండలి ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నారు. అయితే, కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఎన్నికలు తొలుత వాయిదాపడ్డాయి. అనంతరం మహారాష్ట్ర శాసన మండ‌లిలో ఖాళీగా ఉన్న 9 స్థానాల‌కు తొమ్మిది మంది స‌భ్యులే  నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డంతో వీరంతా మే 14న ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఉద్ద‌వ్ ఠాక్రేతో పాటు శివ‌సేన నుంచి నీలం గోర్హే, బీజేపీ నుంచి గోపీచంద్ పడల్కర్, ప్రవీణ్ దాట్కే, రంజీత్‌సింహ్ మోహితే పాటిల్, రమేష్ కరాద్, కాంగ్రెస్‌కు చెందిన రాజేష్ రాథోడ్, ఎన్సీపీకి  చెందిన శశికాంత్ షిండే, అమోల్ మిట్కారి ప్ర‌మాణ స్వీకారం చేశారు.

మరిన్ని వార్తలు