మళ్లీ బ్యాలెట్‌ పేపర్లను వాడే ప్రసక్తే లేదు: ఈసీ

24 Jan, 2019 12:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెట్‌ పేపర్లను వాడే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ఈవీఎంల పనితీరుపై వ్యక్తం చేస్తున్న అనుమానాలను కొట్టిపారేసింది. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా బ్యాలెట్ పేపర్ల  వినియోగంపై స్పష్టత ఇచ్చారు. మన దేశంలో ఎన్నికల సంఘం వినియోగిస్తున్న ఈవీఎంలను ఎవరూ హ్యాక్‌ చేయలేరని పేర్కొన్నారు. ఈవీఎంలపై అనుమానమే లేనపుడు ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లను ఎందుకు వినియోగించాలని ప్రశ్నించారు. 

బీఈఎల్, ఈసీఐఎల్‌ రూపొందించే ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్‌ చేయలేరని స్పష్టం చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను రూపొందిస్తామనీ, సాంకేతిక కమిటీ సమక్షంలో నిబంధనల మేరకు ఈ యంత్రాలను కఠినమైన పరీక్షలకు లోనుచేస్తామని వెల్లడించారు.  2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను(ఈవీఎం) హ్యాక్‌ చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని సయిద్‌ షుజా అనే హ్యాకర్‌ చేసిని ఆరోపణలపై తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు