మరో ఎన్నికల నగారా... షెడ్యూల్‌ విడుదల

25 Feb, 2020 10:22 IST|Sakshi

ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు

న్యూఢిల్లీ : మరో ఎన్నికల నగారా మోగింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 26న ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. మార్చి 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 18 చివరి తేదీ.

మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ చేపడతారు. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో కె.కేశవరావు, ఎంఏ ఖాన్‌, టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మీ, తెలంగాణలో కేవీపీ, గరికపాటి రాంమోహన్‌రావు పదవీ కాలం ముగుస్తుంది. దీంతో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు