ఎలక్షన్ వాచ్

17 Mar, 2014 03:06 IST|Sakshi

 వారణాసే మోడీకి రాజకీయ సమాధి: లాలూ
 పాట్నా: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వారణాసిలో పోటీకి నిలుపుతూ ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ తీవ్రంగా ఆక్షేపించారు. మోడీ రాజకీయ జీవితానికి వారణాసే సమాధి అవుతుందని వ్యాఖ్యానించారు. లాలూ ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘అసలు వారణాసి గురించి మీరేం అనుకుంటున్నారు? అది పూర్తిగా లౌకిక ప్రాంతం. మోడీ అక్కడ ఓడిపోవడం ఖాయం. ఆయనకు వారణాసే రాజకీయ సమాధి అవుతుంది’ అని జోస్యం చెప్పారు. అసలు మోడీ తన సొంత రాష్ట్రాన్ని వదిలి, వేరే రాష్ట్రంలో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సీట్లు లేవని ఎద్దేవా చేశారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ నేతలకు సీట్లు దొరకడంలేదు. అందుకే సీటు వెతుక్కునే క్రమంలో వారు అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. మోడీ కూడా వారిలో ఒకరు. సురక్షిత నియోజకవర్గాన్ని వెతుక్కునేందుకు గుజరాత్ నుంచి పారిపోయి వచ్చారు’’ అని లాలూ ఎద్దేవా చేశారు.
 
 ‘బాలల హక్కులపై మేనిఫెస్టోల్లో చెప్పండి’
 న్యూఢిల్లీ: తమ తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో బాలల హక్కుల పరిరక్షణపై ఒక అధ్యాయాన్ని చేర్చాలని అన్ని రాజకీయ పార్టీలను బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) కోరింది. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్‌పీ, సీపీఎం తదితర పార్టీలకు ఎన్‌సీపీసీఆర్ చైర్‌పర్సన్ కుశల్ సింగ్ లేఖ రాశారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం పథకాలు, ఆచరణ సంస్థలు ఉన్నా వాటిని సమర్థవంతంగా పనిచేయించడంలో పలు సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. నిర్బంధ ఉచిత విద్య, లైంగిక దాడుల నుంచి రక్షణ, బాల కార్మికులు, బాల్య వివాహాలు, వలస కార్మికుల పిల్లలకు రక్షణ, శిశు, భ్రూణ హత్యలు తదితర అంశాలపై తీసుకునే చర్యలపై మేనిఫెస్టోల్లో పేర్కొనాలని ఆమె లేఖలో కోరారు.
 
 మహిళలకు జాతీయపార్టీల ప్రాధాన్యం!
 సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభ ప్రతిపక్షనాయకురాలు సుష్మాస్వరాజ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ 15వ లోక్‌సభలో కీలక బాధ్యతలు నిర్వహించి తమ శక్తియక్తులను చాటుకున్నారు. రాజకీయాల్లో మహిళల రాణిం పు, ప్రాధాన్యం పెరుగుతున్నందున ఈసారి కూడా వారికి పెద్దసంఖ్యలో సీట్లు ఇచ్చేం దుకు ప్రధాన పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు సైతం మహిళా సభ్యులను చట్టసభలకు పంపేందుకు ముందుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2009 ఎన్నికలను ఒకసారి  పరిశీలిస్తే మొత్తం 556 మంది మహిళా అభ్యర్థులు లోక్‌సభ బరి లో నిలిచారు. వీరిలో 134 మందిని జాతీయ పార్టీలు, 27 మందిని రాష్ట్రీయ పార్టీలు, 188 మందిని గుర్తింపు పొందిన పార్టీలు పోటికి నిలిపాయి. మరో 207 మంది మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తమ్మీద పదిహేనో లోక్‌సభ ఎన్నికల్లో 556 మంది మహిళలు పోటీపడగా.. 61 మంది గెలిచారు.
 
 ఎన్నికల తర్వాతే ‘మూడు’కు యత్నించాల్సింది!
 తృతీయ కూటమి ఏర్పాటుపై ఏబీ బర్ధన్ వ్యాఖ్య
 న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాతే జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటుకు ప్రయత్నించి ఉండాల్సిందని సీపీఐ అభిప్రాయపడింది. ఎన్నికలకు ముందే ఈ కూటమి ఏర్పాటుకు యత్నించడం వామపక్షాలు చేసిన తప్పిదమని సీపీఐ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ వ్యాఖ్యానించారు. సీఎన్‌ఎన్-ఐబీఎన్‌లో కరణ్ థాపర్ నిర్వహించే డెవిల్స్ అడ్వొకేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్రాంతీయ పార్టీలు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాయన్నారు. మూడో కూటమిలో ఎక్కువగా ఉండేది ప్రాంతీయ పార్టీలేనని, అందువల్ల ఎన్నికలకు ముందే వాటితో సీట్ల సర్దుబాటు అంశంపై మాట్లాడకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. ‘‘ఎన్నికలకు ముందే తృతీయ కూటమి ఏర్పాటు చేయడానికి మేం ప్రయత్నించకుండా ఉండాల్సింది. ఎందుకంటే చాలా ప్రాంతీయ పార్టీలు తమ సీట్ల సంఖ్యను సాధ్యమైనంత ఎక్కువగా పెంచుకోవడానికి కృషి చేస్తాయి. ఏ సీటును కూడా వదులుకోవడానికి అంగీకరించవు’’ అని వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వైఖరితో తీవ్ర నిరాశ చెందానని బర్ధన్ తెలిపారు. సీపీఐకి ఆ రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క సీటు ఇస్తాననడం ఆవేదన కలిగించిందన్నారు.
 
 మావోయిస్టు పోస్టర్ల కలకలం
 కోరాపుట్: ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోస్టర్లు మరోసారి కలకలం రేపాయి. ఏప్రిల్ 10న జరగనున్న పోలింగ్‌లో ఓటు వేయరాదని హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో కోరాపుట్ జిల్లాలోని మజ్హిగూడ, దస్‌మంత్‌పూర్ పంచాయతీల్లో పోస్టర్లు వెలిశాయి. దీంతో స్థానిక నేతల్లో ఆందోళన నెలకొంది. అన్ని పార్టీలూ పేదలకు వ్యతిరేకమైనవేనని ఆ పోస్టర్లలో మావోయిస్టులు ఆరోపించారు. ప్రచారం కోసం వచ్చే నేతలను గ్రామాల్లోకి అడుగుపెట్టనీయవద్దని స్థానికులను హెచ్చరించారు. కాగా, తాము కొన్ని పోస్టర్లను స్వాధీనం చేసుకున్నామని, వీటి వెనుక స్థానికంగా మావోయిస్టు మద్దతుదారుల హస్తం ఉందని భావిస్తున్నట్లు కోరాపుట్ ఎస్పీ అవినాష్‌కుమార్ తెలిపారు.  
 
 మాధేపురా బరిలో శరద్ యాదవ్
 న్యూఢిల్లీ: బీహార్లోని లోక్‌సభ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను జనతాదళ్ (యునెటైడ్) ఆదివారం విడుదల చేసింది. 32 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. దీనిలో  పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్, సినీ దర్శకుడు ప్రకాశ్ ఝా, పారిశ్రామికవేత్త అనిల్ కుమార్ శర్మ తదితర ప్రముఖుల పేర్లు ఉన్నాయి. శరద్ యాదవ్ మాధేపురా నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. ప్రకాశ్ ఝా పశ్చిమ చంపారన్ నుంచి, అనిల్‌కుమార్ శర్మ జెహానాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. శరద్‌కు పోటీగా ఆర్‌జేడీకి చెందిన పప్పూ యాదవ్ బరిలో దిగనున్నారు.
 
 ‘చాయ్ పే చర్చా’పై ఈసీ కేసు నమోదు
 న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి మరింత ప్రచారం కల్పించే ఉద్దేశంతో ఆపార్టీ నిర్వహిస్తున్న ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమంలో పాల్గొన్న ఆపార్టీ నేతలపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్ష్మీపూర్ ఖెరి జిల్లాలో ఈ నెల 8న నిర్వహించిన చాయ్ పే చర్చా కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రజలకు ఉచితంగా టీలు పంచారని యూపీ ఎన్నికల ప్రధానాధికారి ఉమేష్ సిన్హా వెల్లడించారు.

మరిన్ని వార్తలు