అన్నాడీఎంకేలో ఎన్నికలు

20 Aug, 2014 00:36 IST|Sakshi
అన్నాడీఎంకేలో ఎన్నికలు

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో ఎన్నికల సందడి నెలకొంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికల తేదీ ప్రకటించారు. బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆ పదవికి ఇతరులెవ్వరు నామినేషన్ దాఖలు చేయరు కాబట్టి, 29న అధికారికంగా జయలలిత ఏకగ్రీవ ఎంపిక ప్రకటన వెలువడనున్నది. గుర్తింపు పొందిన రాష్ట్రీయ, జాతీయ పార్టీల కార్యవర్గాల ఎన్నిక తప్పని సరిగా సంస్థాగత ఎన్నికల ద్వారా చేయాలన్న నిబంధనను ఎన్నికల కమిషన్ విధించింది.

ఆ మేరకు కొన్ని పార్టీలు సంస్థాగత ఎన్నికల ద్వారా పదవులు భర్తీ చేస్తుంటే, మరికొన్ని పార్టీలు మొక్కుబడిగా నిర్వహించడం జరుగుతోంది. ఇక,  అన్నాడీఎంకే విషయానికి వస్తే  పార్టీ నిబంధనల మేరకు ప్రధాన కార్యదర్శి పదవికి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సిందే. ప్రతి ఐదేళ్లకు ఓ మారు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
 
ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే, జయలలిత దృష్టిలో పడే రీతిలో పెద్ద ఎత్తున నాయకులు తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆమెను ప్రధాన కార్యదర్శిగా బలపరుస్తూ నామినేషన్లు సమర్పించడం పరిపాటే. ఇప్పటి వరకు అన్నాడీఎంకేకు 25ఏళ్లుగా జయలలిత ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మళ్లీ ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఎన్నుకునేందుకు ఎన్నికల నగారాను మోగించారు.
 
ప్రకటన : పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నిక నిమిత్తం అన్నాడీఎంకే కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి జరగనున్న ఎన్నికకు ఎన్నికల అధికారిగా పార్టీ నిర్వాహక కార్యదర్శి విశాలాక్షి నెడుంజెలియన్ వ్యవహరించనున్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి 24వ తేదీ వరకు సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
 
27న నామినేషన్ల పరిశీలన, 28న ఉప సంహరణ ప్రక్రియ జరగనుంది. 29న ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అన్నాడీఎంకేలో జయలలిత పదవికి మరెవరు పోటీ చేయడానికి సాహసించ ప్రసక్తే లేని దృష్ట్యా, ఆ తేదీన ఆమె ఏకగ్రీవ  ఎంపికను అధికారికంగా ప్రకటిస్తారు. ఎన్నికల నామినేషన్ల పర్వం ఆరంభం కావడంతో నేటి నుంచి ఆ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొననుంది.

మరిన్ని వార్తలు