ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు!

19 Dec, 2016 20:23 IST|Sakshi
ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు!

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధిక సంఖ్యలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో నిర‍్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్‌  డిసెంబర్‌ చివరి వారంలో ఎన్నికల తేదీలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ సమర్పణ జరిగిన అనంతరం ఫిబ్రవరి రెండోవారంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని ఎలక్షన్ కమిషన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఐదు రాష్ట్రాల్లో బోర్డు, ఇంటర్‌ పరీక్షలకు ముందే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల తేదీలపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని సూచనలు చేసినట్లు సమాచారం.  పంజాబ్‌, గోవా,మణిపూర్‌, ఉత్తరాఖండ్ల అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు విడతల్లో పోలింగ్‌ జరిగే అవకాశాలున్నాయి. ఇక  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడవు 2017 మే 27తో ముగియనుండగా, ఈ నేపథ్యంలో యూపీ అసెంబ్లీ పదవీకాలం ముగియకముందే.. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని అధికార పార్టీ సమాజ్‌ వాదీ, మరోవైపు అధికారం కోసం బీఎస్పీ పోటీ పడుతున్నాయి. ఇక పంజాబ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పోటీపడుతుండగా, కొత్తగా ఆమ్‌ ఆద్మీపార్టీ పోటీకి దిగటంతో అక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది.  గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ఆప్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు