నరకం అంటే ఇదేనేమో...

7 Nov, 2017 15:07 IST|Sakshi

సాక్షి, కోల్‌కతా : ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో ఈ మధ్యే బంకుర జిల్లాలో చోటు చేసుకుంది. సమీపంలోని అడవి నుంచి జన సంద్రంలోకి వచ్చేందుకు యత్నించిన ఏనుగును, దాని గున్నను అక్కడి గ్రామస్తులు ఇలా చెదరగొడుతున్నారన్న మాట. 

ఓ తల్లి ఏనుగు, ఓ పిల్ల ఏనుగును చెదరగొట్టేందుకు బాణా సంచా, తారా జువ్వలను ప్రజలను కాల్చారు. అయితే ఆ మంటలు వాటి మీద పడిపోగా.. ఆ వేడికి తాళలేక ఇదిగో ఇలా బాధతో రోదిస్తూ పరిగెడుతున్నాయి. ఆసమయంలో అక్కడే ఉన్న విప్లవ్‌ హజ్రా అనే ఓ వైల్డ్‌ ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోను క్లిక్ మనిపించాడు. అంతేకాదు ఆ ఫోటోను ఈ యేడు శాంక్చరీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అవార్డుల పోటీకి పంపించగా.. హెల్‌ ఈజ్‌ హియర్‌ (నరకం ఇక్కడే ఉంది) అన్న ట్యాగ్ లైన్‌తో ఆ ఫోటోకు అవార్డు కూడా దక్కింది. ఈ విషయాన్ని శాంక్చురీ ఏషియా తమ అధికారిక ఫేస్‌బుక్‌ లో ప్రకటించింది. 

అస్సాం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఇలా ఏనుగుల దాడుల వ్యవహారం సర్వసాధారణంగా మారిపోయింది. ఇది ఈ ఒక్కనాటి సమస్య కాదు. పట్టణీకరణ పేరిట అడవులను నరక్కుంటూ పోవటంతో అవి ఎటువెళ్లాలో తెలీక ఇలా గ్రామాల వైపు దూసుకొస్తున్నాయి.  తమ మనుగడ కోసం కొందరు చేసే యత్నానికి మూగ ప్రాణులు బలౌతున్నాయని జంతు ప్రేమికుల ఆరోపణ. ఆశ్రయం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లే క్రమంలో అవి వేటగాళ్ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి కూడా. 2014 నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా సుమారు 84 ఏనుగులు ఇలా మృత్యువాత పడ్డాయని గణాంకాలు చెబుతుండగా.. ఆ సంఖ్య ఎక్కువే ఉండొచ్చని బంకులా జిల్లా ఫారెస్ట్ రేంజ్‌ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోపై పలువురు తమ శైలిలో స్పందిస్తున్నారు.

మరిన్ని వార్తలు