భుజబలం ఓకే.. బుద్ధి బలమూ చూడండి..!

18 Feb, 2020 17:48 IST|Sakshi

గజరాజులకు భుజబలమే కాదు. బుద్ధి బలమూ ఎక్కువే అని మరోసారి నిరూపితమైంది. అనాలోచితంగా, అడ్డదిడ్డంగా కాకుండా.. ఓ ఏనుగు స్మార్ట్‌గా ఆలోచించి గమ్యాన్ని చేరింది. మనుషులకు కూడా కష్టమనిపించే పాడుబడ్డ చిన్న మెట్ల మార్గం గుండా పైకి చేరింది. ఎలాంటి అదురూ బెదురూ లేకుండా.. పైకి చేరిన ఏనుగు ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంది. ఇక జంతువులకు సంబంధించి విశేషాలను సోషల్‌ మీడియాలో పంచుకునే ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కాశ్వాన్‌ ఈ వీడియోను షేర్‌ చేయగా వైరల్‌ అయింది. 

గజరాజుకు వేరే ఆప్షన్‌ లేదు. అందుకే కాస్త కష్టమైనా.. మెట్ల దారినే ఎంచుకుంది. అందుబాటులో ఉన్న వనరుల్ని చక్కగా వినియోగించుకోవడంలో ఏనుగుల తర్వాతే ఏదైనా అని ఆయన పేర్కొన్నారు. అవి త్వరగా నేర్చుకోవగలవని రాసుకొచ్చారు. విద్యుత్‌ ఫెన్సింగ్‌ను దాటుకుని వెళ్లడం, దారికి అడ్డుగా ఉన్న వాటిని తెలివిగా తొలగించడం ఆ కోవలోనివేనని అన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ‘భారీ కాయమైనా, చిన్న గాయమైనా కాకుండా శిథిలమైన మెట్ల ద్వారా ఏనుగు పైకి చేరింది. తెలివైన జంతువు’అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘అడవిలోని జంతువుల స్వేచ్ఛకు భంగం కలగకుండా చేస్తే.. అవి జనావాసాల్లోకి ఎందుకు చొరబడతాయి. అభివృద్ధి అని చెప్పి ఇష్టారీతిన అడవులను నరకడం, నిర్మాణాలు చేపట్టడం మంచిదా..! అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు