కశ్మీర్‌లో 64 మంది ఉగ్రవాదుల ఏరివేత

7 May, 2020 15:03 IST|Sakshi
కశ్మీర్‌ రేంజ్‌ పోలీస్‌ ఐజీ విజయ్‌ కుమార్‌

శ్రీనగర్‌ : ఈ ఏడాది జనవరి నుంచి భద్రతాబలగాలు జరిపిన మొత్తం 27 ఆపరేషన్‌లలో 64 మంది ఉగ్రవాదులను ఏరివేశామని కశ్మీర్‌ రేంజ్‌ పోలీస్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. యాక్టివ్‌గా ఉన్న మరో 25 మంది ఉగ్రవాదులను అరెస్ట్‌ చేశామని చెప్పారు. గత ఆరునెలలుగా కరడుగట్టిన ఉగ్రవాది, ఉగ్రసంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌లో కమాండర్ రియాజ్‌ నైకూ(32) కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. కాగా, ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన రియాజ్‌ నైకూ చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే బుధవారం హతమయిన విషయం తెలిసిందే. నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం మంగళవారం రాత్రే పోలీసులకు అందింది. అయితే పోలీసులు వెంటనే కాల్పులు జరపలేదు.

నైకూ గతంలో ఇలాంటి పరిస్థితుల నుంచే తప్పించుకున్నందున, ఈసారి తప్పించుకోకుండా, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తనిఖీ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌ గ్రూపును, జమ్మూకశ్మీర్‌ పోలీసులను ఈ ఆపరేషన్‌ కోసం వినియోగించుకున్నారు. మరోవైపు సీఆర్పీఎఫ్‌ బలగాలు నైకూ ఉన్న ప్రాంతం నుంచి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఈలోగా విషయం అర్థం చేసుకున్న ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు జరపడం ప్రారంభించారు. భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో బయటకు వచ్చిన ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. అనంతరం లోపల ఉన్న ఉగ్రవాదిని కూడా భద్రతాబలగాలు హతమార్చాయి. అయితే మరణించింది నైకూనా లేక మరొకరా అన్నది వెంటనే తెలియలేదు. తర్వాత పోలీసులు నైకూ మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా, గత నెల రోజులుగా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో ఒక కల్నల్‌, ఒక మేజర్‌తోపాటూ మొత్తం 18మంది భద్రతా సిబ్బంది వీర మరణం పొందారు.

నైకూ చరిత్ర ఇది..
మొదట్లో లెక్కల టీచర్‌గా పనిచేసిన నైకూ 2012లో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థలో చేరాడు. అతనిపై మొదటిసారి 2012 జూన్‌ 6న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటివరకూ అతనిపై 11 కేసులు ఉన్నాయి. భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్‌ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు.

మరిన్ని వార్తలు