ఎంబ్రాయర్’ పై సీబీఐ విచారణ!

14 Sep, 2016 14:02 IST|Sakshi

న్యూఢిల్లీ : యూపీఏ ప్రభుత్వ పాలనలో  బ్రెజిల్ విమాన సంస్థ ఎంబ్రాయర్‌తో కుదిరిన ఒప్పందంలో ముడుపుల ఆరోపణలపై విచారణ చేపట్టాలని రక్షణ శాఖ బుధవారం సీబీఐకి లేఖ రాసింది. కాగా యూపీఏ హయాంలో 2008లో బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయర్, డీఆర్డీవో మధ్య మూడు విమానాలు (స్వదేశీ రాడార్ వ్యవస్థను అనుసంధానం చేసి) కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. మొత్తం రూ. 14వేల కోట్లతో ఈ ఒప్పందం జరిగింది.

208 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.14వేలకోట్లు) విలువైన ఈ ప్రాజెక్టులో భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయంటూ అమెరికా న్యాయశాఖ విచారణ జరుపుతోంది. అయితే ఎంబ్రాయర్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకునేందుకు అప్పటి ప్రభుత్వంలో కొందరికి (ఎవరికి అనేది తెలియదు) ముడుపులిచ్చిందని అమెరికా విచారణ సంస్థలు గుర్తించాయి. దీనిపై ఇప్పుడు భారత్ వివరాలు సేకరించే పనిలో పడింది.

ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది దేశాల్లో కాంట్రాక్టులు పొందేందుకు ఎంబ్రాయర్ సంస్థ ఆయా ప్రభుత్వాలకు ముడుపులు ముట్టజెప్పిందనే ఆధారాలున్నాయని తెలిపింది. దీనిపై సమాచారం అందుకున్న డీఆర్డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) మరిన్ని వివరాలు అందుకునేందుకు విచారణ జరపనుందని.. భారత రక్షణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే.

దీంతో 15 రోజుల్లో ఈ కాంట్రాక్టుతోపాటు అవినీతికి సంబంధించిన ఆరోపణలపై పూర్తి సమాచారాన్ని ఇవ్వాలంటూ ఎంబ్రాయర్ విమాన తయారీ సంస్థను డీఆర్డీవో కోరింది. అయితే బ్రెజిల్ సంస్థ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా తదుపరి చర్యలుంటాయని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ జరపాలంటూ రక్షణ శాఖ లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు