నేటితో లాక్‌డౌన్‌కు 30 రోజులు

23 Apr, 2020 17:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ నేటితో 30వ రోజుకు చేరుకుందని ఎంపవర్డ్ కమిటీ-2 ఛైర్మన్ సీకే మిశ్రా తెలిపారు. లాక్‌డౌన్ దేశంలో ఎంతోమందికి కష్టాలు తెచ్చిపెట్టిందని, కానీ కష్టాలతో ప్రజలు చేస్తున్న లాక్‌డౌన్ ఎన్నో జీవితాలు కాపాడిందని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నెల రోజుల్లో కరోనా వైరస్ ఉధృతి నిలకడగా ఉంది. ఈ 30 రోజుల్లో కరోనా టెస్టులు 33 రెట్లు పెరిగాయి. అయినా ఇది సరిపోదు.. ఆ విషయం మాకూ తెలుసు. అందుకే విస్తృత స్థాయిలో కరోనా టెస్టులు చేస్తూ ముందుకెళ్తున్నాం. కరోనా విస్తృతిని ఒక స్థాయికి పరిమితం చేయగలిగాం. టెస్టులు, పాజిటివ్ కేసుల నిష్పత్తి మొదటి నుంచి ఒకేలా ఉంది. 5 లక్షల టెస్టుల్లో యూకే 80వేల పాజిటివ్, ఇటలీలో 1 లక్షకు పైగా ఇలా.. పశ్చిమ దేశాల్లో ప్రతి 5 లక్షల టెస్టులకు పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ( 24 గంటల్లో 1409 పాజిటివ్ కేసులు )

దక్షిణ కొరియాలో మాత్రం టెస్టుల సంఖ్యకు, కేసుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం చాలా ఉంది. పశ్చిమ దేశాలతో పోల్చితే దక్షిణ కొరియా బాగా పనిచేసింది. టెస్ట్, ట్రేస్, ట్రీట్మెంట్ ఒక వ్యూహం. ఇది కొత్త సవాల్. సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాం. ప్రతి రోజూ కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. ఎదురవుతున్న సవాళ్లకు తగ్గట్టుగా వ్యూహాలు మారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్లాం. అన్ని వనరులను వినియోగించుకుంటూ అవసరాన్ని మించి సంసిద్ధతను పెంచుకుంటూ వెళ్తున్నాం. సోషల్ డిస్టెన్సింగ్ కచ్చితంగా అమలు చేయడమే మన లక్ష్యం. వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడేవారిని కాపాడుకోవాలి. మరణాల సంఖ్యను చాలా తక్కువకు పరిమితం చేయాలి. కోలుకునేవారి సంఖ్యను పెంచాల’’ని అన్నారు. ( దారుణం: బ్రతికుండగానే కళ్లు పీకి.. )

మరిన్ని వార్తలు