‘అయోధ్య’ కోసం చట్టం తేవాలి

20 Oct, 2018 01:55 IST|Sakshi

ఆరెస్సెస్‌ చీఫ్‌ భాగవత్‌ డిమాండ్‌

నాగపూర్‌: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ డిమాండ్‌ చేశారు. శ్రీరాముని జన్మస్థలంలో అద్భుతమైన రామాలయాన్ని నిర్మించాలన్నది కోట్లాది ప్రజల ఆకాంక్ష అన్నారు. ‘ఆత్మగౌరవ దృష్టితో చూసినా లేదా దేశంలో  సౌభ్రాతృత్వ వాతావరణం నెలకొనాలంటే ఆలయ నిర్మాణం అవశ్యం’ అని పేర్కొన్నారు. జన్మభూమి ప్రదేశంలో గతంలో దేవాలయం ఉందనడానికి సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించినా ఇంకా ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం అప్పగించలేదన్నారు.

రామ మందిర నిర్మాణం రాజకీయాల వల్ల ఆలస్యమవుతోందన్న భాగవత్‌.. సమాజం ఓపికనూ పరీక్షించడం ఎవరికీ మంచిది కాదని హెచ్చరించారు. ‘స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు మత విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నారు. దాంతో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కేంద్రం పూనుకుని, అవసరమైతే సంబంధిత చట్టం తీసుకువచ్చైనా ఆ అడ్డంకులు తొలగించాలి’ అని డిమాండ్‌ చేశారు. విజయదశమి సందర్భంగా సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద సంఘ్‌ శ్రేణులను ఉద్దేశించి భాగవత్‌ ప్రసంగించారు.

శబరిమలపై..: శబరిమల అంశంపై స్పందిస్తూ.. ‘సంప్రదాయాలను, భక్తుల విశ్వాసాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. తీర్పుతో సమాజంలో విబేధాలు ఏర్పడ్డాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకు హిందూ సమాజమే ఇలాంటి దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన ప్రశ్నించారు. అర్బన్‌ నక్సలిజం వల్ల సమాజంలో విద్వేషం వ్యాప్తి చెందుతోందన్నారు.

మరిన్ని వార్తలు