-

కుల్గామ్‌లో భీకర ఎన్‌కౌంటర్‌

25 Feb, 2019 05:08 IST|Sakshi

ముగ్గురు జైషే ఉగ్రవాదులను హతమార్చిన బలగాలు

ఉగ్రవాదుల కాల్పుల్లో డీఎస్పీ, ఆర్మీ జవాన్‌ మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం భీకర ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కుల్గామ్‌ జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్లో ముగ్గురు జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులు హతం కాగా, ఓ పోలీస్‌ డీఎస్పీ, మరో జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు. కుల్గామ్‌ జిల్లాలోని తురిగామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు పోలీసులకు నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో డీఎస్పీ అమన్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని పోలీస్, ఆర్మీ సంయుక్త బృందం ఘటనాస్థలికి బయలుదేరింది. అయితే తురిగామ్‌ను ఈ బృందం సమీపించగానే ఉగ్రవాదులు వీరిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో డీఎస్పీ అమన్‌ ఠాకూర్‌ మెడ భాగంలో బుల్లెట్‌ దూసుకుపోయింది. వెంటనే భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

ఈ విషయమై పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..అమన్‌ ఠాకూర్‌తో పాటు హవల్దార్‌ సోంబీర్‌కు తీవ్రగాయాలు కాగా హుటాహుటిన వాయుమార్గం ద్వారా ఆర్మీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అయితే, చికిత్స పొందుతూ వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారన్నారు. తురిగామ్‌లో నక్కిన ముగ్గురు జైషే ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఆర్మీ మేజర్, ముగ్గురు సైనికులు గాయపడ్డారనీ, వీరి ఆరో గ్యం స్థిరంగా ఉందని పేర్కొన్నారు. అమన్‌  మృతిపై గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్, డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

రెండు ప్రభుత్వ ఉద్యోగాలను కాదని.. 
జువాలజీలో మాస్టర్స్‌ చేసిన అమన్‌ ఠాకూర్‌కు పోలీస్‌ శాఖలో పనిచేయాలన్నది చిరకాల స్వప్నం. అందుకే రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ పోలీస్‌శాఖలో చేరారు. దొడా జిల్లాకు చెందిన అమన్‌కు తొలుత జమ్మూకశ్మీర్‌ సాంఘిక సంక్షేమ శాఖలో అధికారిగా ఉద్యోగం వచ్చింది. అనంతరం స్థానిక ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్‌గానూ ఉద్యోగం దక్కింది. అయితే పోలీస్‌ ఉద్యోగంపై ఉన్న మక్కువతో అమన్‌ తన ప్రయత్నాలు కొనసాగించారు. చివరికి జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ సర్వీస్‌కు 2011లో ఎంపికయ్యారు. ఏడాదిన్నర క్రితం కుల్గామ్‌ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల విభాగానికి చీఫ్‌గా అమన్‌ నియమితులయ్యారు. అప్పట్నుంచి అమన్‌ బృందం చాలామంది కరుడుగట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టింది. కాగా, విధినిర్వహణలో చూపిన ధైర్య సాహసాలకు గానూ అమన్‌ డీజీపీ ప్రశంసా మెడల్‌–సర్టిఫికెట్, షేర్‌–ఏ–కశ్మీర్‌ మెడల్‌ను అందుకున్నారు. అమన్‌కు తల్లిదండ్రులతో పాటు భార్య సరళా దేవి, కుమారుడు ఆర్య(6) ఉన్నారు.   

మరిన్ని వార్తలు