రాజకీయాల్లోకి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌!

19 Jul, 2019 12:56 IST|Sakshi
ప్రదీప్‌శర్మ,ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌

ముంబై : ముంబైకి చెందిన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌, ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌శర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో చేరేందుకే ఈ నిర్ణయం తీసుకున్నటు ఆయన వెల్లడించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీనియర్‌ అధికారులకు పంపించారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తరపున ఆయన పోటీ చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా 2008లో ముంబై గ్యాంగ్‌స్టర్‌ లఖన్‌ భాయ్‌పై జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శర్మతో పాటు మరో 13 మంది పోలీస్‌ అధికారులపై అప్పట్లో మహారాష్ట్ర పోలీస్‌ విభాగం సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల పాటు విధులకు దూరంగా ఉన్న ప్రదీప్‌ శర్మ 2013లో తిరిగి థానే కైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరారు.

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరు..
1983లో మహారాష్ట్ర పోలీస్‌ విభాగంలో చేరిన ప్రదీప్‌ శర్మ అనతికాలంలోనే ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందారు. 90వ దశకంలో అండర్‌వరల్డ్‌ మాఫియా కార్యకలపాలను అడ్డుకునే అధికారాన్ని ముంబై క్రైమ్‌ బాంచ్‌ శర్మకు కట్టబెట్టడంతో ఆయన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరుడైన ఇక్బాల్‌ కస్కర్‌ను అరెస్టు చేసి పెను సంచలనమే సృష్టించారు. మొత్తం 300 మందికి పైగా గ్యాంగ్‌స్టర్స్‌ను అంతమొందించిన ప్రదీప్‌ శర్మ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో సినిమాలు కూడా తెరకెక్కడం విశేషం. 

మరిన్ని వార్తలు