మూడో దశ హరిత భరితం

6 Jun, 2014 22:20 IST|Sakshi
మూడో దశ హరిత భరితం

 ఇంధనం, నీరు పొదుపు చేయనున్న మెట్రో స్టేషన్లు

 న్యూఢిల్లీ: మెట్రో రైలు మూడో దశలో హరిత స్టేషన్లను నిర్మించనున్నారు. ఇవి నీరు, ఇంధనం పొదుపు చేయనున్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) వెల్లడించింది. 2016 నాటికి ఇందుకు సంబంధించిన పనులు పూర్తికానున్నాయి. మూడో దశలో భాగంగా మొత్తం 90 స్టేషన్లు నిర్మితమవనున్నాయి. వాననీటి పరిరక్షణ, ఇంధన ఆదాతోపాటు వ్యర్థాలను నిర్వహించేవిగా ఉంటాయి.
 
 ట్యాప్‌లలోనుంచి నీరు తక్కువగా రావడం వంటి అనేక వెసులుబాట్లు ఈ స్టేషన్లలో ఉంటాయి. దీంతోపాటు పచ్చదనానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. త్వరగా వేడెక్కకుండా చేసేందుకుగాను ఈ స్టేషన్ల గోడలు, కిటికీలతోపాటు పైభాగాన్ని మూసేస్తారు. దీంతోపాటు లోపలికి వీలైనంతమేర తాజా గాలి వచ్చేవిధంగా డిజైన్ చేయనున్నారు. కొత్త స్టేషన్ల నుంచి టన్నుల కొద్దీ ఇంధనాన్ని డీఎంఆర్‌సీ పొదుపు చేయనుంది.
 
 గాలిలోకి కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేయకుండా ఉండేందుకుగాను తగు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు ఏడాదికి సగటున 3,66.272 కెడబ్ల్యూహెచ్ మేర ఇంధనాన్ని పొదుపు చేసే అవకాశముంది. భూగర్భ స్టేషన్లు ఏడాదికి 10,11,482  కేడబ్ల్యూహెచ్ విద్యుత్‌ను పొదుపు చేసే అవకాశముంది. ఇదిలాఉంచితే సబ్‌స్టేషన్లతోపాటు అధికారుల నివాస సముదాయాలను సైతం ఇదే పద్ధతిలో నిర్మించనున్నారు. కాగా బారాఖంబాలోని మెట్రోభవన్‌ను హరిత స్టేషన్‌గానే నిర్మించిన సంగతి విదితమే.
 
అటవీశాఖకు స్థలం అప్పగింత
నగరంలో పచ్చదనాన్ని విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా డీఎంఆర్‌సీ మొక్కలను నాటడం కోసం డీఎంఆర్‌సీ తనకు చెందిన కొంతస్థలాన్ని అటవీశాఖకు అప్పగించింది. శాస్త్రి పార్కు వద్దగల 15 హెక్టార్ల భూమిని అప్పగించామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా సస్టయినబుల్ గ్రీన్ ఇనీషియేటివ్ (ఎస్‌జీఐ) అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో మున్ముందు మొత్తం 25 వేల మొక్కలను నాటాలని డీఎంఆర్‌సీ నిర్ణయించింది. ఇప్పటికే ఈ సంస్థ నగరంలో మూడు లక్షల మొక్కలను నాటిన సంగతి విదితమే.
 
అంతేకాకుండా ఆరు వేల చెట్లను ఇతర ప్రాంతాల్లో తిరిగి నాటింది. వాస్తవానికి మెట్రో తొలి దశ పనులను చేపట్టిన సమయంలో 14,505 చెట్ల కూల్చివేతకు అటవీశాఖ నుంచి అనుమతి లభించినప్పటికీ డీఎంఆర్‌సీ మాత్రం 13,85 చెట్లను మాత్రమే తొలగించడంద్వారా పచ్చదనానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పింది. రెండో దశలో 24,453 చెట్ల కూల్చివేతకు అనుమతి లభించినప్పటికీ 17,997కే పరిమితమైంది. ఇక మూడోదశలో 16 వేల చెట్ల తొలగింపునకు అనుమతి లభించింది. అయితే అందులో 15 నుంచి 20 శాతంమేర చెట్లను కాపాడే దిశగా డీఎంఆర్‌సీ ప్రణాళికలను రూపొందించుకుంటోంది.

మరిన్ని వార్తలు