ఓ ఇంజనీరు.. 48 లక్షల లంచం డబ్బు!

23 Nov, 2016 16:45 IST|Sakshi
ఓ ఇంజనీరు.. 48 లక్షల లంచం డబ్బు!
ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ శాఖలో ఇంజనీరు. రోజూలాగే సాయంత్రం పూట ఆయన ధ్యానం చేసుకుంటున్నారు. అంతలో ఆయన సహోద్యోగి ఒకరు ఫోన్ చేసి.. అర్జంటుగా టీవీ ఆన్ చేయమన్నారు. ఇంకేముంది.. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటిస్తున్నారు. ఆయన గుండె ఝల్లుమంది. ఇంట్లోని బెడ్రూంలో రహస్యంగా ఓ ట్రంకు పెట్టెలో దాచిపెట్టిన రూ. 48 లక్షల నగదు విషయం గుర్తుకొచ్చింది. కాసేపటి వరకు అసలు ఏం జరుగుతోందో కూడా తనకు అర్థం కాలేదని ఆయన అన్నారు. తన పేరు, వివరాలు బయట పెట్టవద్దంటూ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వోద్యోగం చేసేటప్పుడు లంచాలు సర్వసాధారణమేనని ఆయన వ్యాఖ్యానించారు. పాత కరెన్సీ నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేసేందుకు వీలున్నా.. కేవలం 2.5 లక్షల రూపాయలు మాత్రమే వేయాలి. అది కూడా డిసెంబర్ నెలాఖరులోపు మాత్రమే.
 
ఏవైనా పనులు చేయించాల్సి వచ్చినప్పుడు వాటిలో కమీషన్ తీసుకోవడం తప్పడం లేదని అన్నారు. ఇక పండుగలు వచ్చాయంటే ఖరీదైన బహుమతులు చాలా వస్తాయని, వాటన్నింటినీ కాదని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. అలాగే తాను కూడా తన పై అధికారులకు బంగారు నగలు, ఖరీదైన సూట్లు, రిస్టు వాచీలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. రోడ్డు నిర్మాణాల లాంటి పనుల్లో అంచనాల్లో కలిపే తాము తీసుకునే డబ్బులు కూడా ఉంటాయని, వాటి కోసం ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదని వివరించారు. ఇప్పుడు తన వద్ద ఉన్న 48 లక్షల రూపాయలను కూడా తాను సులభంగానే మార్చేసుకుంటున్నానని ఆయన చెప్పారు. అయితే, ఎలాగన్న విషయాన్ని మాత్రం వివరించలేదు. 
మరిన్ని వార్తలు