వైరల్‌: ఇంగ్లిష్‌ రెండు లైన్లు చదవలేని ఇంగ్లిష్‌ టీచర్‌

1 Dec, 2019 08:45 IST|Sakshi

లక్నో: కొన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎంత నాణ్యంగా ఉంటుందో కళ్లకు కట్టే ఉదంతం ఇది. ప్రతిభతో ఉద్యోగం సంపాదించుకుందో, లేకపోతే వేరే దారుల్లో కొలువు కొట్టేసిందో తెలియదు గానీ.. ఆ ఇంగ్లిష్ టీచర్‌ ఇంగ్లిష్ పాఠ్య పుస్తకంలోని కనీసం రెండు లైన్లు కూడా సరిగా చదవలేక అడ్డంగా దొరికిపోయింది. తనిఖీకి వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్‌ ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా సికందర్‌పూర్ సరౌసిలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజున ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్‌ దేవేంద్ర కుమార్ పాండే ఓ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు.

అక్కడ ఓ తరగతి గదిలో ఇంగ్లిష్ బోధిస్తున్న ఉపాధ్యాయురాలి బోధన తేడాగా ఉండడంతో ఆమెకు ఇంగ్లిష్ పుస్తకం ఇచ్చి చదవమన్నాడు. ఆమె పిల్లలకంటే దారుణంగా చదవడం మొదలెట్టింది. దీంతో వెంటనే జిల్లా మెజిస్ట్రేట్‌ ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో ఉపాధ్యాయురాలితో ఉన్న ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు మెజిస్ట్రేట్‌కు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.​ పిల్లల భవిష్యత్తు ఇలాంటి వారి చేతుల్లో పెడితే వారి భవిష్యత్తు ఏంటి అని జిల్లా కలెక్టర్‌ ప్రశ్నించడంతో వారు కూడా చేసేదేమీ లేక మిన్నుకుండిపోయారు.

మరిన్ని వార్తలు