మరోసారి తెరమీదకు ఎన్రికా లెక్సి ఘటన

10 Jul, 2020 20:03 IST|Sakshi

తిరువనంతపురం: కేరళకు చెందిన ప్రిజిన్‌ అనే ఓ యువకుడు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి కుటుంబం ఇటలీ నుంచి రూ. 100 కోట్లు నష్టపరిహారం డిమాండ్‌ చేస్తోంది. కేరళ యువకుడికి.. ఇటలీకి సంబంధం ఏంటనుకుంటున్నారా.. అయితే చదవండి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అంటే 2012లో కేరళ తీరం వెంబడి చేపల వేటకు వెళ్ళిన జాలర్లను సముద్ర దొంగలుగా భావిస్తూ ఇటలీ ఓడ ‘ఎన్రికా లెక్సి’పై ఉన్న ఇటలీ మెరైన్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు చనిపోయారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు ప్రిజిన్‌ అక్కడే ఉన్నాడు. అప్పుడు అతడి వయసు 14 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతర్జాతీయ ట్రిబ్యునల్‌కి చేరింది. ఈ క్రమంలో తాజాగా జాలర్ల మరణానికి సంబంధించి ప్రాణ నష్టానికి బదులుగా పరిహారం పొందేందుకు భారత్‌ అర్హత సాధించిందని ట్రిబ్యునల్‌ తెలిపింది.

ఈ నేపథ్యంలో నాటి ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన ప్రిజిన్ కుటుంబం ఇటలీ నుంచి రూ.100 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతుంది. ఈ సందర్భంగా ప్రిజిన్‌ కుటుంబ సభ్యులు ఈ నెల 6న కేంద్రానికి లేఖ రాశారు. దానిలో ‘‘ఎన్రికా లెక్సి’ సంఘటన 2012 ఫిబ్రవరి 15న జరిగింది. అప్పుడు ప్రిజిన్‌ అక్కడే ఉన్నాడు. నాటి ఘటనలో ప్రిజిన్‌ స్నేహితులు అజీష్‌ షింక్‌, మరోక మత్య్సకారుడు జెలాస్టిన్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటనతో అతడు షాక్‌కు గురయ్యాడు. తనకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి’ అని తెలిపారు. (ఇటాలియన్‌ మెరైన్స్‌‌ కేసు: కీలక పరిణామం)

అంతేకాక ‘ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ప్రిజిన్‌కు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవ్వాల్సిన రక్షణ ఇవ్వలేదు. ఈ ఘటన తర్వాత అతడు డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ప్రభుత్వం అతడికి సరైన వైద్య చికిత్స కూడా అందించలేదు. ఈ బాధతోనే అతడు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రిజిన్‌ నాటి ఘటనలో బాధితుడే. అతడికి ఇటలీ ప్రభుత్వం రూ.100 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలిందిగా కేంద్రం డిమాండ్‌ చేయాలి’ అని ప్రిజిన్‌ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు