సాంకేతికతను అందిపుచ్చుకోండి

18 Nov, 2017 03:09 IST|Sakshi

పలు ప్రాజెక్టుల సమీక్షలో అధికారులకు మోదీ సూచన

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులను పకడ్బందీగా పర్యవేక్షించాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మేరీ సడక్‌ యాప్‌తో పాటు స్పేస్‌ టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. మౌలిక రంగాలైన రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాల అభివృద్ధి పనులపై ఆయన శుక్రవారం సమీక్ష జరిపారు. కార్యక్రమానికి నీతి ఆయోగ్, రోడ్లు, హైవేలు, రైల్వే శాఖల అధికారులు హాజరయ్యారు. రోడ్లు, రైల్వే రంగాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేయడానికి సమగ్ర విధానం ఉండాలని ప్రధాని పేర్కొన్నట్లు పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రధాన్‌ మంత్రి సడక్‌ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో  రోజుకు 130 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకున్నామని అధికారులు వివరించారు. హరిత సాంకేతికతతో 4000 కిలో మీటర్లకు పైగా రోడ్లు నిర్మించామని, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, కోల్డ్‌ మిక్స్, జియో టెక్స్‌టైల్స్, ఫ్లైయాష్, ఐరన్, కాపర్‌ల వినియోగాన్ని రోడ్ల నిర్మాణంలో ప్రోత్సహిస్తున్నట్లు పీఎంఓ వెల్లడించింది. చార్‌ధామ్‌ ప్రాజెక్టు, క్వాజిగుండ్‌–బానీహల్‌ సొరంగం, చీనాబ్‌ రైల్వే బ్రిడ్జి, జిరిబామ్‌–ఇంఫాల్‌ ప్రాజెక్టు, ఈస్టర్న్‌ ఫెరిఫెరల్‌ ఎక్స్‌ప్రెస్‌వే తదితర  ప్రాజెక్టుల పురోగతిని మోదీ సమీక్షించారు. 

మరిన్ని వార్తలు