బంగ్లాదేశీ నటుడి వీసా రద్దు 

17 Apr, 2019 04:11 IST|Sakshi

తృణమూల్‌ తరపున ప్రచారం చేసినందుకే.. 

న్యూఢిల్లీ/కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎమ్‌సీ) తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలతో బంగ్లాదేశ్‌ ప్రముఖ సినీనటుడు ఫిర్దౌస్‌ అహ్మద్‌ వీసాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ‘వీసా ఉల్లంఘనలకు సంబంధించి బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఫిర్దౌస్‌ అహ్మద్‌ వ్యాపార వీసాను రద్దు చేశాం. ఆయనకు ‘లీవ్‌ ఇండియా’పేరుతో నోటీసు పంపాం. అలాగే ఫిర్దౌస్‌ పేరును బ్లాక్‌లిస్టెడ్‌లో ఉంచాం’అని హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

దీంతో భవిష్యతులో ఆయన భారత్‌లో పర్యటించడంపై ప్రభావం చూపుతుందన్నారు. ఫిర్దౌస్‌తో పాటు బెంగాలీ నటులు అంకుష్, పాయల్‌ ఇక్కడి రాయ్‌గంజ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీఎమ్‌సీ అభ్యర్థి కన్హయ్యలాల్‌ అగర్వాల్‌ తరపున ఆదివారం రోడ్‌ షోలో పాల్గొని ప్రచారం చేసిన వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో టీఎమ్‌సీ తరపున ఆయన ప్రచారంలో పాల్గొనడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లేనని బీజేపీ ఆరోపించింది. ఈమేరకు బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కలిసి ఫిర్యాదుచేశారు. 

>
మరిన్ని వార్తలు