మూడు భాగాలు.. రాముడివే ఇపుడు!!

10 Nov, 2019 02:06 IST|Sakshi

అలహాబాద్‌ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం

2010లో స్థలాన్ని మూడు భాగాలు చేసిన హైకోర్టు  

‘మసీదు నిర్మాణానికి ఆలయాన్ని కూల్చివేయలేదు. పురాతన గుడి శిథిలాలపైనే దాన్ని నిర్మించారు. ఆలయ శిథిలాల్లో కొన్నిటిని మసీదు నిర్మాణానికి వినియోగించారు. వివాదాస్పద ప్రాంతంలోని చిన్నభాగంలో రాముడి జన్మస్థలం ఉన్నట్లు హిందువులు విశ్వసిస్తూ వచ్చారు. 1855కి పూర్వమే రామ్‌ఛబుత్ర, సీతారసోయి అస్తిత్వంలో ఉండగా హిందువులు అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. దీనివల్లే భూమిపై
కక్షిదారులకు ఉమ్మడిహక్కు కల్పిస్తున్నాం’’ అని జస్టిస్‌ ఎస్‌యూ ఖాన్‌ పేర్కొన్నారు. 

‘‘ఏఎస్‌ఐ తవ్వకాల్లో దీనికి సంబంధించి 265 ఆధారాలు లభించాయి. ఏఎస్‌ఐ మాజీ డీజీ రాకేశ్‌ తివారీ నివేదికలోనూ పాత ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించినట్లు స్పష్టంచేశారు’’ అని జస్టిస్‌ శర్మ పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి.  

న్యూఢిల్లీ: అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హిందూ, ముస్లిం పక్షాల మధ్య దశాబ్దాలుగా వివాదం నెలకొంది. రామజన్మభూమి – బాబ్రీ మసీదు ప్రాంతం ఉన్న 2.77 ఎకరాల స్థలాన్ని నిర్మోహీ అఖాడా, రామ్‌లల్లా, సున్నీ వక్ఫ్‌బోర్డుకు మూడు సమాన భాగాలుగా పంచాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. బాబ్రీ మసీదును కూల్చి విగ్రహాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక మందిరాన్ని శ్రీరాముడి జన్మస్థలంగానే పరిగణించిన హైకోర్టు దీన్ని రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు అప్పగించాలని పేర్కొంది. రామ్‌ ఛబుత్ర, సీతారసోయిని నిర్మోహీ అఖాడాకు ఇవ్వాలని, మిగతా భాగాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డుకు అప్పగించాలని సూచించింది. నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా, సున్నీవక్ఫ్‌ బోర్డు తరఫున దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ డి.వి.శర్మ, జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్, జస్టిస్‌ ఎస్‌.యు.ఖాన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 2 – 1 మెజార్టీతో నాడు తీర్పు వెలువరించింది. 

బాల రాముడిదే భూమి... 
న్యాయసూత్రాల ప్రకారం హిందూ దేవుళ్లను చట్టబద్ధులైన వ్యక్తులుగా గుర్తించవచ్చు. దావా వేసే హక్కుతోపాటు వారిని దావా పరిధిలోకి చేర్చవచ్చు. ఆరాధించే భక్తుల దైవభక్తే దీనికి ప్రాతిపదిక. రామ్‌లల్లా (బాల రాముడు) విరాజ్‌మాన్‌ను దావా వేసిన వ్యక్తిగా భావిస్తూ సుప్రీం కోర్టు ఈ కేసు విచారణను చేపట్టింది. అయోధ్యలోని బాల రాముడిని చట్ట ప్రకారం శాశ్వత మైనర్‌గా గుర్తిస్తూ విచారణ ప్రారంభించింది. రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో బాలరాముడి తరపున ఆయన స్నేహితుడిగా భావించే వీహెచ్‌పీ నేత త్రిలోక్‌నాథ్‌ పాండే ప్రాతినిథ్యం వహించారు. 1989లో తొలిసారిగా బాల రాముడిని ఈ కేసులో దావాదారుడిగా చేర్చారు. రెండేళ్ల తరువాత ఈ వివాదం అలహాబాద్‌ హైకోర్టుకు చేరింది. ఈ కేసులో భగవంతుడి స్నేహితుడిగా తనను కూడా భాగస్వామిగా చేర్చాలని కోరుతూ అలహాబాద్‌ హైకోర్టు మాజీ జడ్జి దేవకి నందన్‌ అగర్వాల్‌ కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో ఆయన వీహెచ్‌పీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్‌లల్లాకు వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంపై యాజమాన్య హక్కులు అప్పగిస్తూ తీర్పునిచ్చింది.  

సంపన్న అఖాడా! 
నిర్మోహీ అఖాడాను స్వామి రామానంద స్థాపించారు. దేశవ్యాప్తంగా పలు ఆలయాలు, మఠాలున్న సంపన్న అఖాడా ఇది. యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, బిహార్‌లోనూ దీని విభాగాలున్నాయి. వివాహం, లైంగిక సంబంధాలకు దూరంగా సాధారణ జీవితాన్ని గడిపే నిర్మోహీ అఖాడా సాధువులు కఠిన నియమాలు పాటిస్తారు. రాముడిని పూజిస్తారు. యుక్త వయసులో ఉండగానే కొత్తవారిని అఖాడా సభ్యులుగా చేర్చుకుంటారు. వేదాలు, ఉపనిషత్తులను ఔపోసన పట్టడంతోపాటు కొన్ని రకాల యుద్ధ క్రీడలనూ అభ్యసిస్తారు. అయోధ్య వివాదం తెరపైకి రావడంతో నిర్మోహీæ అఖాడా ప్రాధా న్యం పెరిగింది. రామ జన్మభూమిని తమకు అప్పగించాలంటూ నిర్మోహీ అఖాడా తరఫున న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది. రామాలయం నిర్మాణాన్ని అడ్డుకోకుండా ఫైజాబాద్‌ యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరుతూ అఖాడా మహంత్‌ రఘువర్‌దాస్‌ 1885లో కేసు వేశారు. కోర్టు దీన్ని కొట్టివేసింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన వ్యాజ్యాన్ని 1950 జనవరిలో హిందూ మహాసభ నేత జీఎస్‌ విశారద్‌ దాఖలు చేశారు. 1960 నాటికి అఖాడా కూడా ఈ కేసులో భాగస్వామిగా మారింది.  

అమీనాబాద్‌ టు సుప్రీం 
రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదానికి సంబం ధించి ముస్లిం పక్షాల తరపున న్యాయపోరాటం 1857లో మౌజం మౌల్వీ మహ్మద్‌ అస్ఘర్‌తో మొదలైంది. హనుమాన్‌గఢ్‌ మహంత్‌ ఈ కట్టడాన్ని బలవంతంగా తన అధీనంలోకి తీసుకున్నారని ఆయన మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. బాబ్రీ మసీదు ప్రధాన గేటు తాళం తెరవాలని 1986 జనవరి 2న ఫైజాబాద్‌ జిల్లా జడ్జి ఆదేశించడంతో వివాదం రాజుకుంది. నాడు అత్యవసరంగా సమావేశమైన ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు మసీదుకు అనుకూలంగా ప్రచారం నిర్వహించి మద్దతు కూడగట్టాలని నిర్ణ యించింది. న్యాయవాది అబ్దుల్‌ మన్నన్‌ నివాసంలో జనవరి 4న ముస్లిం నేతలు సమావేశమయ్యారు. యూపీ నేత అజంఖాన్‌ కూడా దీనికి హాజరయ్యారు. రెండు రోజుల తరువాత లక్నో అమీనాబాద్‌లోని  ఓ ఇంట్లో 200 మందితో నిర్వహించిన సమావేశంలో బాబ్రీ మసీద్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటైంది. అజంఖాన్, జఫర్యాబ్‌ గిలానీలను కన్వీనర్లుగా, మౌలానా ముజఫర్‌ హుస్సేన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఏఐఎంపీఎల్‌బీ ఆధ్వర్యంలో బాబ్రీ మసీద్‌ యాక్షన్‌ కమిటీ న్యాయపోరాటం ఆరంభించింది. 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐఎంపీఎల్‌బీపై ఒత్తిడి పెరిగింది. పోరాడే బాధ్యతను బాబ్రీ మసీద్‌ యాక్షన్‌ కమిటీకి అప్పగించారు. సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు తదితర ముస్లిం పక్షాల తరపున దాదాపు రెండు దశాబ్దాలుగా బాబ్రీ మసీద్‌ యాక్షన్‌ కమిటీ వివిధ కోర్టుల్లో న్యాయ పోరాటం చేసింది.   

పురాతన అవశేషాలు ఉన్నాయా?
భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాల మేరకు 1976–77 సంవత్సరాల్లో తిరిగి 2003లో వివాదాస్పద ప్రాంతంలో తవ్వకాలు జరిపింది. మసీదు నిర్మాణం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ తవ్వకాల సందర్భంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (జీపీఆర్‌) వినియోగించుకుంది. ఇందుకోసం టోజో డెవలప్‌మెంట్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ సాయం తీసుకుంది. తవ్వకాల్లో కనుగొన్న ఆధారాలపై 2003లో కోర్టుకు సమర్పించిన నివేదికలోని వివరాలివీ..
- తవ్వకాల్లో క్రీస్తుపూర్వం 13వ శతాబ్దం నాటి ఆధారాలూ లభ్యమయ్యాయి. 
కుషాణులు, శుంగ వంశ పాలకులు, గుప్తుల కాలం, మధ్యయుగాల నాటి ఆనవాళ్లు కనిపించాయి.
ఇక్కడ బయటపడిన 15్ఠ15 కొలతలతో ఉన్న వేదికకు చాలా ప్రాముఖ్యం ఉంది.
ఇక్కడున్న వలయాకార ఆలయాన్ని 7– 10 శతాబ్దాల మధ్యలో నిర్మించారు. 
ఇక్కడే ఉన్న మరో భవనం కూడా 11, 12వ శతాబ్దాల్లో రూపుదిద్దుకుంది. 
దీంతోపాటు మరో భారీ నిర్మాణం ఫ్లోర్‌ మూడు దఫాలుగా పూర్తయింది. 
వీటిపైనే 16వ శతాబ్దంలో వివాదాస్పద కట్టడం(మసీదు) నిర్మితమైంది. 
సరిగ్గా మసీదు గోపురం ఉన్న చోటే దిగు వన 50 రాతి స్తంభాలు బయటపడ్డాయి. వీటితోపాటు బౌద్ధ, జైన ఆలయాల ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు