ఎంట్రీ టాక్స్ సబబే!

12 Nov, 2016 02:26 IST|Sakshi
ఎంట్రీ టాక్స్ సబబే!

తేల్చిచెప్పిన రాజ్యాంగ ధర్మాసనం
 
 న్యూఢిల్లీ: రాష్ట్రాలు విధించే ఎంట్రీ టాక్సులో తప్పేమీలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పన్ను వసూలు చట్టాలను రూపొందించుకోవటం ఆయా రాష్ట్రాల హక్కు అని శుక్రవారం వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల బెంచ్ దీనిపై చర్చించింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను వసూలు చేసే హక్కుందని 7-2 మెజారిటీతో ధర్మాసనం తీర్పు చెప్పింది. ‘పక్కరాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై పన్ను, సొంత రాష్ట్రంలో తయారీ పన్ను ఒకేలా ఉండేలా.. అవసరాలకు అనుగుణంగా ఆర్థిక నిబంధనలు మార్చుకోవటం రాష్ట్రాల హక్కు.

ఈ విధానాన్ని అనుసరిస్తే రాష్ట్రాలు రాజ్యాంగంలోని 304 (ఏ) సెక్షన్‌ను అతిక్రమించినట్లు కాదు’ అని జస్టిస్ టీఎస్ ఠాకూర్ తెలిపారు. దీనిపై జస్టిస్ ఎస్‌ఏ బాబ్దే, జస్టిస్ శివ కీర్తిసింగ్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ భానుమతిలు ఏకీభవించినట్లు తెలిపారు. రాష్ట్రాలు ఎంట్రీ టాక్స్ విధించే చట్టాలను రూపొందించటం రాజ్యాంగ విరుద్ధమంటూ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ మెజారిటీ అభిప్రాయంతో విభేదించారు. ‘పన్నులకు సంబంధించిన ఏ చట్టమైనా రాజ్యాంగంలోని 304 (ఏ) సెక్షన్ పరిధిలో ఉండాలి. ఇలాంటి చట్టం వివక్షరహితంగా ఉందని మెజారిటీ సభ్యులు భావిస్తే.. దీనికి రాజ్యాంగ బద్ధత కల్పించవచ్చు’ అని 911 పేజీల తీర్పులలో సుప్రీం పేర్కొంది. ‘పక్కరాష్ట్రంలో ఉత్పత్తి అరుున వస్తువుకు భారీగా పన్ను విధించటం ద్వారా సొంతరాష్ట్రంలో దీని ధర పెరుగుతుంది.

కానీ ఇలా పన్ను విధించటాన్ని రాజ్యాంగ విరుద్ధంగా భావించలేం’ అని బెంచ్ పేర్కొంది. ఈ సమస్యలను రాష్ట్రాలే పరిష్కరించుకుంటాయంది. ఆర్టికల్ 301 ప్రకారం వివక్షలేని పన్ను విధానంపై రాజ్యాంగ నియంత్రణ ఉంచకూడదని.. స్వేచ్ఛావాణిజ్య హక్కును కల్పించాలని ధర్మాసనం గుర్తుచేసింది. ఆర్టికల్ 301 ప్రకారం వస్తువులు, సేవలు, వ్యక్తులు, వాణిజ్యం, వ్యాపారం, లావాలదేవీల మూలధనం విషయంలో దేశమంతా ఒకే విధానం ఉండాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
 
 42 మంది పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా
 చండీగఢ్: సట్లేజ్-యమునా లింక్ (ఎస్‌వైఎల్) కెనాల్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్‌వైఎల్ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పుకు నిరసనగా గురువారం పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయగా.. శుక్రవారం 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చండీగఢ్ రోడ్లపై పాదయాత్రగా బయలుదేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష హాల్లో సమావేశమై.. అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖలు సమర్పించారు. అరుుతే వీరి రాజీనామాలపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతోపాటు ఈ వివాదాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణరుుంచింది.

మరిన్ని వార్తలు