కేరళ ప్రభుత్వంతో టచ్‌లో ఉన్నాం: పర్యావరణ శాఖ

8 Jun, 2020 15:57 IST|Sakshi

తిరువనంతపురం: టపాకాయలు నింపిన పండును తినడం వల్ల గర్భంతో ఉన్న ఏనుగు మరణించిన ఘటన ప్రమాదవశాత్తూ సంభవించినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని కేంద్ర పర్యావరణ శాఖ సోమవారం తెలిపింది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని.. నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. ఏనుగు మరణానికి పరోక్ష కారణమైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. అదే విధంగా కొంతమంది స్థానికులు పంట పొలాల్లోకి అడవి జంతువులు ప్రవేశించకుండా పేలుడు పదార్థాలను నింపి అక్రమ కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. (ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు: వివరాలు)

ఈ మేరకు.. ‘‘ఆ ఏనుగు ప్రమాదవశాత్తూ పేలుడు పదార్థాలు నింపిన పండు తిని మరణించినట్లు ప్రాథమిక విచారణ తెలిపింది. కేరళ ప్రభుత్వంతో టచ్‌లో ఉన్నాం. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశారు. ఈ అమానుష ఘటనలో భాగస్వాములైన మిగతా వ్యక్తులను పట్టుకోవాల్సి ఉంది’’అని పర్యావరణ శాఖ వరుస ట్వీట్లలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న వదంతులు నమ్మవద్దని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (గర్భిణి ఏనుగు మృతి: వెలుగులోకి కొత్త విషయం) 

కాగా కేరళలోని వెల్లియార్‌ నదిలో గర్భంతో ఉన్న 15 ఏళ్ల ఏనుగు మృతిచెందిన విషయం విదితమే. పేలుడు పదార్థాలు నింపిన పండు తినడం వల్ల నోరు ఛిద్రమై తీవ్ర వేదన అనుభవించి ఆ ఏనుగు ప్రాణాలు వదిలింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పర్యావరణ, జంతు ప్రేమికులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదివారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. ఘటనపై లోతుగా విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు