‘అయ్యప్ప’కు పొంచి ఉన్న పెను వివాదం

20 Nov, 2018 17:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి మరో పెను వివాదం పొంచి ఉంది. ఆ వివాదానికి కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులే కారణం అవుతాయనడంలో సందేహం లేదు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రస్తుతం వివాదం రగులుతున్న విషయం తెల్సిందే. ఈ వివాదం కారణంగానే సుప్రీం కోర్టు అయ్యప్ప ఆలయానికి సంబంధించి జారీ చేసిన మరో ఉత్తర్వులు మరుగున పడిపోయాయి. శబరిమల పరిసర ప్రాంతాల్లోని అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని జస్టిస్‌ మదన్‌ బీ లోకుర్‌ నాయకత్వంలోని సుప్రీం కోర్టు బెంచీ నవంబర్‌ 2వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. మొదటి వివాదం భక్తుల నమ్మకానికి సంబంధించినది కాగా, పొంచి ఉన్న వివాదం పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది.

ఒకప్పుడు సన్నిదానంలో శబరిమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండేది. ఇప్పుడు దాని చుట్టూ 63.5 ఎకరాల పరిధిలో చెట్లుపోయి కాంక్రీటు జంగిల్‌ ఆవిర్భవించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటే ఈ కాంక్రీటు జంగిల్‌లో 90 శాతం కట్టడాలను కూల్చాల్సిందే. శబరిమల ఆలయం పరిసరాల్లో పర్యావరణ పరిస్థితులను పరిరక్షించాలంటూ కోజికోడ్‌కు చెందిన సామాజిక కార్యకర్త శోభీంద్రన్‌ నాలుగేళ్ల క్రితం సుప్రీం కోర్టులో పిల్‌ వేశారు. దాంతో శబరిమల ఆలయం పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే అక్రమ కట్టడాలను పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఓ కేంద్ర కమిటీని సుప్రీం కోర్టు ఆదేశించింది. అటవి ప్రాంతాల్లో గనులు, పరిశ్రమలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల అమలును పర్యవేక్షించే కమిటీయే ఇది. ఈ కమిటీ ఇటీవలనే సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో అనేక భయానక వాస్తవాలు బయట పడ్డాయి. శబరిమల ఆలయం భక్తుల నుంచి వస్తున్న భారీ ఆదాయానికి ఆశపడి 1998లో కేరళ అసెంబ్లీ ఆమోదించిన ఆలయం మాస్టర్‌ ప్లాన్‌నే కాకుండా ఆ తర్వాత 2007లో తీసుకొచ్చిన సవరణ ప్లాన్‌ను కూడా ఉల్లంఘించి కేరళ దేవసం బోర్డు పలు అక్రమాలను నిర్మించిన విషయాన్ని కమిటీ నివేదిక వెల్లడించింది.

శబరిమల ఆలయ పరిసర కొండల్లో పుడుతున్న పంబా నదీ ప్రవాహాన్ని దెబ్బతీసేలా నది ఒడ్డునే కాకుండా నది ప్రవహించే ప్రదేశంలో కూడా అక్రమ కట్టడాలు నిర్మించారట.
అందుకనే గత ఆగస్టులో వచ్చిన పంబా వరదల వల్ల రెండంతస్థుల మురుగుదొడ్ల భవనాలు, భక్తుల క్లాక్‌రూమ్‌లు, ఓ రెస్టారెంట్‌ కూలిపోయాయని నివేదిక తెలిపింది. ఆ మరుగుదొడ్ల స్థానంలో మరోచోట మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినా అవి ఇంకా పూర్తి కాలేదు. పర్యవసానంగా భక్తులు భహిర్భూమిని ఆశ్రయిస్తున్నారట. పంబా నది కాలుష్యం కాకుండా నియంత్రించేందుకు రెండు సివరేజ్‌ ప్లాంట్‌లను నిర్మించినా అందులో ఒకదాన్నే ఆపరేట్‌ చేస్తున్నారు. దానికి కూడా అన్ని మరుగు దొడ్ల కాల్వలను అనుసంధానించలేదు. కొన్ని కాల్వలు నేరుగా పంబా నదిలో కలుస్తున్నాయి. పైగా ఆగస్టులో వచ్చిన వరదల్లో ఈ రెండు సీవరేజ్‌ ప్లాంట్‌లు, మరుగుదొడ్డి కాల్వలు దెబ్బతిన్నాయి. ఆ కాల్వలు కూడా ఒవర్‌ ఫ్లోఅయి నేరుగా పంబా నదిలో కలుస్తున్నాయి. పర్యవసానంగా నీటిలో ‘ఫేకాల్‌ కోలిఫామ్‌ బ్యాక్టీరియా’ కనీసం ఊహకు కూడా అందనంతగా పెరిగిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. స్నానం చేయడానికి పనికి వచ్చే నీటిలో ‘ప్రతి 100 ఎంఎల్‌ నీటికి 2,500 ఎంపీఎన్‌’ కన్నా ఈ బ్యాక్టీరియా తక్కువ ఉండాలట. 2014–2015లో సేకరించిన శాంపిల్‌ నీటిలోనే ‘100 ఎంల్‌ నీటికి  బ్యాక్టీరియా 13,20,000 ఎంపీఎన్‌’ ఉందట. అంటే ఉండాల్సిన దానికన్నా 500 రెట్లు ఎక్కువ. సీవరేజ్‌ ప్లాంటులు, మురుగు కాల్వలు దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లోబ్యాక్టీరియా మరింత ప్రమాదకరంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

 అడవి పందులు వచ్చి నీటిని తాగుతున్నాయంటేనే అందులో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని అర్థం అట. అయ్యప్ప ఆలయంకు వచ్చే భక్తులు విధిగా ఈ పంబా నదిలో స్నానం ఆచరిస్తారు. అంతేకాకుండా పట్టణం మిట్ట, అలప్పూజ, కొట్టాయం జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు తాగునీటి కోసం ఈ నదిపైనే ఆధారపడుతున్నారు. నవంబర్‌ 17వ తేదీన ప్రారంభమైన ‘మండల మకరవిలక్కు’ సీజన్‌లో భక్తుల రద్దీ మరింత పెరగడం వల్ల పంబా నదికి వాటిల్లే కాలుష్యాన్ని అంచనా కూడా వేయలేకపోతున్నామని పంబా పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి నక్కే సుకుమారన్‌ నాయర్‌ లాంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వినకుండా నది ఒడ్డుకు 50 మీటర్ల దూరంలోనే కేరళ దేవసం బోర్డు పనుల నిర్వహణా భవనాన్ని కూడా నిర్మించారని ఆయన తెలిపారు.

నీలక్కల్‌ వద్ద భక్తుల సౌకర్యాల కోసం 2007లో సవరించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 250 ఎకరాలను కేరళ ప్రభుత్వం కేటాయించినా పట్టించుకోకుండా సన్నిధానంలోనే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నాయర్‌ ఆరోపించారు. గత నెలలోనే సన్నిదానంలో 52 గదుల అతిథి గృహాన్ని కేరళ దేవసం మంత్రి కే. సురేంద్రన్‌ ప్రారంభించారు. సన్నిదానం, పంబా ప్రాంతాల్లోనే కాకుండా నీలక్కల్‌ వద్ద కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని కేంద్ర కమిటీ పేర్కొంది. వాటన్నింటిని కూల్చివేయాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడం తన కర్తవ్యమని అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్న కేరళ ప్రభుత్వం కూల్చివేతల విషయంలో కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉంటుందా? కూల్చివేతల వల్ల భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటుంది? భక్తులుగానీ, భక్తుల తరఫున హిందూ సంఘాలుగానీ కూల్చివేతలను అనుమతిస్తాయా?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు