ఈపీఎఫ్‌పై వడ్డీ 8.65 శాతం

20 Dec, 2016 08:24 IST|Sakshi
ఈపీఎఫ్‌పై వడ్డీ 8.65 శాతం

0.15 శాతం తగ్గించిన కేంద్రం
ఇది పీపీఎఫ్, జీపీఎఫ్‌పై వడ్డీ కంటే ఎక్కువే: దత్తాత్రేయ
50 లక్షల మంది కొత్త సభ్యుల నమోదు లక్ష్యం

బెంగళూరు: ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ డిపాజిట్లపై వడ్డీపై కేంద్రం కోత విధించింది. 2015–16కు వడ్డీ రేటు 8.8 శాతం ఉండగా ప్రస్తుతం దీనిని 8.65 శాతానికి తగ్గించింది.  గత నాలుగేళ్లలో ఇదే అతి తక్కువ వడ్డీ రేటు. స్వల్ప మిగులు కారణంగా వడ్డీ రేటు తగ్గించాల్సి వచ్చిందని భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ పేర్కొంది. 2016–17 సంవత్సరా నికి గాను ఈపీఎఫ్‌ ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం నాడిక్కడ చెప్పారు. ఈపీఎఫ్‌ఓకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) 215వ సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

పీఎఫ్‌ వాటాదారులతో విస్తృత సంప్రదింపుల నేపథ్యంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు సీబీటీ చైర్మన్ కూడా అయిన దత్తాత్రేయ చెప్పారు. 8.65 శాతం వడ్డీ రేటు ఇచ్చిన తర్వాత సంస్థ రూ.269 కోట్ల మిగుల్లో ఉంటుందన్నారు. వడ్డీ రేటు తగ్గినప్పటికీ ఇలాంటి మిగతా సంస్థలు పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌ (8.1%)), జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌ (8%) వంటి వాటితో పోల్చుకుంటే ఈపీఎఫ్‌ఓ తన ఖాతాదారులకు చెల్లిస్తున్నది ఎక్కువేనన్నారు.

ఇలాఉండగా ఈపీఎఫ్‌ఓ పరిపాలన పరమైన చార్జీలను 0.85 శాతం నుంచి 0.65 శాతానికి తగ్గించాలని నిర్ణయిం చినట్లు తెలిపారు. కొత్త సభ్యుల నమోదు పెంచే కార్యక్రమాన్ని చేపట్టను న్నామని, మొదటి దశలో 50 లక్షల మంది కొత్త సభ్యుల ను చేర్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. గత ఏడాది ఆదాయంతోపాటు అప్పుడు మిగులు రూ.1,600 కోట్లు ఉండగా, ఈ ఏడాది ఈ మొత్తం రూ.410 కోట్లేనని సీపీఎఫ్‌ కమిషనర్‌ జాయ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు