చంపుకోండి.. కానీ నన్నేం అడగొద్దు!

18 Sep, 2018 03:19 IST|Sakshi
లాన్స్‌నాయక్‌ ముఖ్తార్‌ అహ్మద్‌ మాలిక్‌

శ్రీనగర్‌: ఉగ్రవాదులు తలపై తుపాకీ గురిపెట్టినా ఓ జవాన్‌ ఆర్మీ రహస్యాలను చెప్పేందుకు నిరాకరించాడు. దీంతో ఉగ్రవాదులు అతడిని దారుణంగా కాల్చిచంపారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకుంది. కుల్గామ్‌లోని ఛురత్‌ గ్రామానికి చెందిన లాన్స్‌నాయక్‌ ముఖ్తార్‌ అహ్మద్‌ మాలిక్‌ టెరిటోరియల్‌ ఆర్మీకి చెందిన 162వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. ఈ నెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కుమారుడు చనిపోయాడు. దీంతో కుమారుడి కర్మకాండ నిర్వహించేందుకు సోమవారం మాలిక్‌ ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆయన ఇంట్లోకి దూసుకెళ్లారు. తలపై తుపాకీ గురిపెట్టి ఆర్మీ స్థావరాలకు సంబంధించిన వివరాలు చెప్పాలని బెదిరించారు. అయితే ఏమాత్రం తొణకని మాలిక్‌.. ‘కావాలంటే నన్ను చంపుకోండి. కానీ ప్రశ్నలు మాత్రం అడగొద్దు’ అని కరాఖండిగా చెప్పేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఉగ్రవాదులు మాలిక్‌పై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి పరారయ్యారు.

మరిన్ని వార్తలు