పాక్‌తో యుద్ధం జరుగుతుందా!

27 Feb, 2019 14:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 1971 తర్వాత భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్‌ భూభాగంలోకి వెళ్లి దాడులు జరపడం ఇదే మొదటిసారి. 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం సందర్భంగా కూడా పాక్‌స్థాన్‌ భూభాగంలోకి భారత వైమానిక దళాలు చొచ్చుకుపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం నాడు భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పంఖ్తూఖ్వా రాష్ట్రంలోనికి చొచ్చుకుపోయి బాలకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. ఎదురుదాడికి సిద్ధమైన పాకిస్థాన్‌ యుద్ధ విమానాలు బుధవారం భారత సరిహద్దులోకి దూసుకురాగా భారత వైమానికి దళం గట్టిగా ప్రతిఘటించి ఓ పాక్‌ యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది. మిగతా పాక్‌ విమానాలు వెనక్కి తిరిగి పోయాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్ని ఇలాంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా? అన్న చర్చ పలు వర్గాల్లో మొదలైంది. (‘యుద్ధం వస్తే గట్టిగా నిలబడండి’)

‘2016లో భారత వైమానిక దళం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోకి చొచ్చుకుపోయి సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపాయి. అప్పుడు కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాని ఆ పరిస్థితులు యుద్ధానికి దారితీయలేదు. ఇప్పుడు భారత వైమానిక దళం రెండోసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపాయి. కాకపోతే ఈసారి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను దాటి పాకిస్థాన్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాంబులు కురిపించింది. ఇది ప్రస్తుతానికి ప్రతీకాత్మక దాడి మాత్రమే. దాడి గురించి భారత్‌ చెప్పే కథనానికి, పాక్‌ చెప్పే కథనానికి మధ్య ఎంతో వైరుధ్యం ఉంది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని, దాదాపు 350 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయి ఉండవచ్చని భారత దళం చెబుతుండగా, భారత విమానాలు ఖాళీ ప్రదేశంలో బాంబులను కురిపించాయని, ఆనవాళ్లు ఇదిగో! అంటూ పాక్‌ దళం శకలాలను చూపిస్తోంది. ఏదేమైనా పరస్పర దాడులు కొన్ని రోజులు కొనసాగవచ్చు. (సైనికేతర, ముందస్తు దాడి చేశాం)

ఇది నాన్‌ మిలటరీ ప్రీఎంప్టీవ్‌ దాడులుగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వ్యాఖ్యానించారంటేనే యుద్ధానికి కాలుదువ్వడం కాదనేది అర్థం. తాము పాక్‌ సైనికులు లేదా పౌరులు లక్ష్యంగా దాడి చేయలేదని, ఉగ్రవాదుల లక్ష్యంగా దాడి చేశామని చెప్పడమే ఈ మాటల ఉద్దేశం. భారత్‌పై ఉగ్రదాడి జరిగినందుకు, మరిన్ని జరుగుతాయని తెల్సినందునే ఈ దాడి జరిపామని కూడా భారత వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ సమాజానికి సర్ది చెప్పడం కోసం భారత వర్గాలు ఇలా మాట్లాడుతుండవచ్చు. ఒక్కసారి పాక్‌ సరిహద్దు రేఖను ఉల్లంఘించి లోపలకి పోయామంటే చాలు, పాక్‌ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లే. దీనిపై ఏ దేశం ఎలా స్పందిస్తుందో భారత్‌కు ప్రస్తుతం అనవసరం. ఏ దేశమైనా తమ రాజకీయాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే స్పందిస్తాయి. 2016లో మొదటిసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌ భారత వైమానిక దళం జరిపిన తర్వాత సరిహద్దులో పాక్‌ సైనికుల కాల్పుల ఉల్లంఘనలు పెరిగాయి. కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఇప్పుడు మరింత పెరగవచ్చు! ఆవేశంతోనే ఉద్రేకంతోనో ఇరు దేశాల్లోని కొంత మంది యుద్ధాన్ని కోరుకోవచ్చు. ఒక్కసారి యుద్ధం మొదలయితే అది పరిమితంగా జరుగుతుందా? పూర్తిస్థాయిలో జరుగుతుందా? అన్నది చెప్పలేం. యుద్ధం అంటే ఇరువర్గాలకు అపార నష్టం. అందుకని ఇరువర్గాల సైనికులు కూడా యుద్ధాన్ని కోరుకోరు. ప్రస్తుత పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా, లేదా? అన్నది కూడా ఇప్పుడే చెప్పలేం. మరి కొన్ని రోజులు గడిస్తే స్పష్టత రావచ్చు!’
(ఢిల్లీలోని ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, రిటైర్డ్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హెచ్‌ఎస్‌ పనాగ్‌ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని అభిప్రాయాల సారాంశం ఇది)

మరిన్ని వార్తలు