30 కోట్ల మందికి ఈఎస్‌ఐ సేవల విస్తరణ

6 Jan, 2016 03:09 IST|Sakshi
30 కోట్ల మందికి ఈఎస్‌ఐ సేవల విస్తరణ

♦ ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో 8,300 పోస్టుల భర్తీకి చర్యలు: దత్తాత్రేయ  
♦ ఈఎస్‌ఐసీ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

వర్కింగ్ జర్నలిస్టు చట్టం పరిధిలోకి ఎలక్ట్రానిక్ మీడియా
ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టు చట్టం పరిధిలోకి తెచ్చేందుకు త్వరలోనే త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు మంత్రి దత్తాత్రేయ చెప్పారు. త్రైపాక్షిక సమావేశంలో ఏకగ్రీవానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్ మీడియా జర్నలిస్టులకు సామాజిక భద్రత, సంక్షేమ ప థకాలను అందజేస్తామని భరోసా ఇచ్చారు.
 
 
 సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలోని సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన 30 కోట్ల మంది కార్మికులకు ఈఎస్‌ఐసీ సేవలను విస్తరించడం భవిష్యత్ లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ప్రస్తుతం బీమా వ్యక్తులు (ఇన్స్యూర్డ్ పర్సన్) 2 కోట్ల మంది, కుటుంబసభ్యులు 8 కోట్ల మంది ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో 5 కోట్ల మంది బీమా వ్యక్తులకు ఈఎస్‌ఐ సేవలు విస్తరించనున్నామన్నారు. ఢిల్లీలో మంగళవారం ఈఎస్‌ఐసీ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని దత్తాత్రేయ ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

ఢిల్లీ, హైదరాబాద్‌లలో లక్ష మంది ఆటోరిక్షావాలాలకు ప్రయోగాత్మకంగా ఈఎస్‌ఐని అమలు చేయనున్నామన్నారు. సనత్‌నగర్ వైద్యకళాశాలను త్వరలో ప్రారంభించనున్నామని, ఈ వైద్యకళాశాలలో 40 శాతం సీట్లను కార్మికుల పిల్లలకు కేటాయించనున్నామని దత్తాత్రేయ చెప్పారు. దేశంలోని 650 జిల్లాల్లో సేవలందిస్తున్న ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, సిబ్బంది పోస్టుల్లో 8,300 ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ వైద్యకళాశాలలో ఏపీ, తెలంగాణ విద్యార్థులకు అవకాశం లేకపోవడంపై ప్రశ్నించగా, అఖిలభారత ప్రిమెడికల్ పరీక్షను గుర్తిస్తున్నట్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు.

 నిధులను ఓట్లతో ముడిపెట్టొద్దు
 నిధులను ఓట్లతో ముడిపెట్టవద్దని టీఆర్‌ఎస్ ఎంపీ కవితకు మంత్రి దత్తాత్రేయ హితబోధ చేశారు. ‘మంత్రి దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలు హైదరాబాద్‌కు 20 వేల కోట్లు తెస్తే, బీజేపీకి ఓటు వేస్తామని’ టీఆర్‌ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి దత్తాత్రేయ స్పందించారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రి గడ్కారీ రూ. 41 వేల కోట్లు కేటాయించారని, డబుల్ బెడ్రూం పథకానికి కేంద్రం హడ్కో నుంచి రూ. 3 వేల కోట్ల రుణం ఇప్పించిందని, గృహనిర్మాణ పథకం కింద 48 వేల ఇళ్లను మంజూరు చేసిందని ఉదహరించారు. రాజకీయాలు ప్రజల సంక్షేమం కోసమే తప్ప, ఓట్ల కోసమే కాదని కవితకు చురక వేశారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రారంభానికి ఆహ్వానిస్తే ప్రధాని నరేంద్ర మోదీ వస్తారని చెప్పారు.

మరిన్ని వార్తలు