ఈ పోలీసుకు హ్యాట్సాఫ్‌ అంటున్న నెటిజన్లు

22 Dec, 2019 10:54 IST|Sakshi

ఇటావా: పౌరసత్వ సవరణ చట్టంపై దేశం ఆగ్రహావేశాలతో ఊగిపోతోంది. సీఏఏకు వ్యతిరేకంగా సాధారణ యువత, యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ బాధ్యతాయుతమైన పోలీసు జనాల్లో సీఏఏపై ఉన్న అపోహలను పోగొట్టే ప్రయత్నం చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో ఎస్‌ఎస్పీ సంతోష్‌ మిశ్రా శుక్రవారం ఉదయం ముస్లిం సోదరులను కలిశాడు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా(ఎన్‌ఆర్సీ)ల గురించి వివరిస్తూనే వాటివల్ల కలిగే లాభనష్టాలను వారికర్థమయ్యే రీతిలో వివరించాడు.

సంతోష్‌ మిశ్రా అక్కడి ముస్లిం యువకులతో మాట్లాడుతూ.. ‘మీరు వెళ్లిపోవాల్సిందేనని ఎవరు చెప్పారు? మీరు ఎక్కడికీ వెళ్లరు.. ఇక్కడే ఉంటారు, ఇక్కడే చదువుకుంటారు. కలిసి ప్రార్థనలు చేసుకుంటారు. ఈ బిల్లు గురించి వచ్చే పుకార్లను నమ్మకండి. చట్టాన్ని మాత్రమే నమ్మండి. భారత్‌లో ఉన్న ముస్లింలకు సీఏఏ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదు. కేవలం ఇతర దేశాల నుంచి భారత్‌లోకి వచ్చేవాళ్ల గురించే ఈ చట్టం చెబుతోంది. దయచేసి అందరూ శాంతియుతంగా, సామరస్యంగా మెలగండి’ అని అక్కడి జనాన్ని కోరాడు. దీనికి సంబంధించిన వీడియోను బాలా అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘పోలీసులంటే ఇలా ఉంటారు. పోలీసులు ప్రజలకు హాని చేయరు. కానీ ఆవేశంతో మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే సామాన్య జనాన్ని కాపాడటానికి పోలీసులు వారి శక్తిని చూపించక తప్పద’ని పేర్కొన్నాడు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారగా అందులోని పోలీసుకు నెటిజన్లు సెల్యూట్‌ చేస్తున్నారు. చదవండి: నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఇంటింటిపై త్రివర్ణం ఎగరాలి!

మరిన్ని వార్తలు