ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్‌ సాధ్యమేనా ?

11 Aug, 2018 05:27 IST|Sakshi

ఆగస్టు 10వ తేదీ ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుకున్నాం. జీవ ఇంధనాలను ఉపయోగించడం ద్వారా పెట్రోలు వినియోగాన్ని తగ్గించవచ్చని, తద్వారా కోట్ల రూపాయలు ఆదా చేసుకోవచ్చన్న భావనతో ప్రపంచ దేశాలు జీవ ఇంధనమైన ఇధనాల్‌ను పెట్రోల్‌లో కలపాలని నిర్ణయించాయి. మన దేశంలో కూడా ఇథనాల్‌ వినియోగాన్ని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వంలోని నూతన,పునర్వినియోగ ఇంధన మంత్రిత్వ శాఖ 2009లో జీవ ఇంధనాలపై జాతీయ విధానాన్ని  రూపొందించింది.2013 జనవరి నుంచి ఇథనాల్‌ కలిపిన పెట్రోలును అమ్మే విధానాన్ని(ఇబీపీ) ప్రారంభించింది. పెట్రోలియం కంపెనీలు 5శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోలునే అమ్మాలని ఆదేశించింది.2017 నాటికి 20శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోలు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది.అయితే, ప్రభుత్వాల అలసత్వం, ఇథనాల్‌ తగినంత ఉత్పత్తి కాకపోవడం తదితర కారణాల వల్ల గడువుదాటినా లక్ష్యం నెరవేరలేదు.

ఇథనాల్‌కు కొరత
చక్కెర పరిశ్రమల్లో ఉప ఉత్పత్తిగా ఇథనాల్‌ తయారవుతోంది. వివిధ కారణాల వల్ల చెరకు దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇథనాల్‌ ఉత్పత్తి తగ్గిపోతోంది. ఇథనాల్‌ను లిక్కర్‌ తయారీలో ఉపయోగించడం, లిక్కర్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండటంతో ఆ ప్రభుత్వాలు ఇథనాల్‌పై అధిక పన్నులు వసూలు చేస్తున్నాయి. చక్కెర కంపెనీలు కూడా ఇథనాల్‌ను డిస్టిలరీలకు (ఎక్కువ ధర లభిస్తుండటం వల్ల) అమ్మడానికే మొగ్గు చూపుతున్నాయి.దాంతో చమురు కంపెనీలకు కావలసినంత ఇథనాల్‌ దొరకడం లేదు.ఈ సమస్యను అధిగమించడం కోసం ప్రభుత్వం 2018 నాటి జాతీయ జీవ ఇంధన విధానంలో కొన్ని వెసులుబాట్లు కల్పించింది. చక్కెర కర్మాగారాలు చక్కెరను తయారు చేయకుండానే ఇథనాల్‌ను తయారు చేయడానికి అనుమతి ఇచ్చింది.అలాగే,సంప్రదాయంగా వస్తున్న మొలాసిస్‌ నుంచే కాకుండా ఇతర జీవ వ్యర్థాలు, కుళ్లిన బంగాళాదుంపలు, పాడైపోయిన ధాన్యం, గోధుమ, జొన్న, తవుడు మొదలైన వాటి నుంచి కూడా ఇథనాల్‌ తయారీకి అవకాశాలు కల్పించింది.

రెండో తరం ఇథనాల్‌
గోధుమ పొట్టు, తవుడు, పంట వ్యర్థాల నుంచి తయారు చేసే ఇథనాల్‌ను రెండోతరం ఇథనాల్‌గా పిలుస్తారు. ఈ రకం ఇథనాల్‌ తయారీకి  చమురు సంస్థలు 12 రెండో తరం ఇథనాల్‌ రిఫైనరీలను దేశంలో ఆంధ్ర ప్రదేశ్‌ సహా11 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నాయి.వీటి ఏర్పాటుకు 10,000 కోట్లు వెచ్చిస్తున్నాయి.

పెట్రోల్‌లో ఇథనాల్‌ని కలుపుతూ వాడుతున్న రాష్ట్రాలు 21
కేంద్ర పాలిత ప్రాంతాలు 4
ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న ఇథెనాల్‌ 300 కోట్ల లీటర్లు
ఇందులో 130 కోట్ల లీటర్లను లిక్కర్‌ తయారీకి వినియోగిస్తున్నారు
మిగిలిన 170 లీటర్లలో 60 నుంచి 80 శాతం రసాయనాల తయారీకి వాడుతున్నారు. 
 100 నుంచి 120 కోట్ల లీటర్లు మాత్రమే పెట్రోలులో కలపడానికి అందుబాటులో ఉంది
ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వాడకాన్ని పెంచడం కోసం ఇథనాల్‌పై 18 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది
 

మరిన్ని వార్తలు