కశ్మీర్‌లో పర్యటించనున్న ఈయూపీ బృందం

28 Oct, 2019 16:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ‌: యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంటరీ ప్యానెల్‌ (ఈయూపీపీ) అక్టోబర్‌ 29న జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది. ఈ సందర్బంగా 28 మంది సభ్యులతో ఈయూపీ ప్యానెల్‌ ప్రధాని నరేంద్రమోదీతో పాటు, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ను సోమవారం కలిసింది. ఆర్టికల్‌ 370 రద్దు తరువాత కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రధాని మోదీ ప్యానెల్‌​ సభ్యులకు వివరించారు. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. 

ఈ నేపథ్యంలో ఈయూపీ ప్యానెల్‌ సభ్యులు కశ్మీర్‌లో ఉన్న ప్రజలు, స్థానిక మీడియా, డాక్టర్లతో మాట్లాడితే బాగుంటుందని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ తన తల్లి ట్వీటర్‌ అకౌంట్‌ ద్వారా  పేర్కొన్నారు. ప్రపంచానికి జమ్మూకశ్మీర్‌కు మధ్య ఉన్న లోహపుతెర ఎత్తాల్సిన అవసరం ఉందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఏర్పడిన పరిస్థితులకు ప్రభుత్వానిదే  బాధ్యత అని అన్నారు. 

మెహబూబా ముఫ్తీ ట్విటర్‌ అకౌంట్‌ను ఇల్తిజా హాండిల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం కశ్మీర్‌ విషయంలో అబద్ధాలు చెబుతోందని ఇల్తీజా ఆరోపించారు. రెండు నెలలకు పైగా కశ్మీరీ పౌరులు నిర్భంధంలో ఉన్నారని పేర్కొన్న ఆమె చాలా ప్రాంతాలలో  144 సెక‌్షన్‌ అమల్లో ఉందన్నారు. వాస్తవాలు బయటకు రాకుండా ప్రభుత్వం స్థానిక మీడియాను బెదిరింపులకు గురిచేస్తోందని ఆమె ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు