50 లక్షలా.. కార్పొరేటర్ కూడా పార్టీ మారడు!

19 Oct, 2016 19:25 IST|Sakshi
50 లక్షలా.. కార్పొరేటర్ కూడా పార్టీ మారడు!
మహారాష్ట్రలోని ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఇంతకుముందు రూ. 50 లక్షలిస్తే ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయేవాళ్లని.. అదే ఇప్పుడు ఆ డబ్బుకు కనీసం కార్పొరేటర్లు కూడా పార్టీ మారట్లేదని ఆయన అన్నారు. షోలాపూర్ జిల్లాలోని కర్మాలా నగరంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయనిలా వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్‌ముఖ్ తన ప్రజాప్రతినిధులను బెంగళూరుకు తరలించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. 
 
తన ఎమ్మెల్యేలను కూడా ఎవరైనా కొనేస్తారేమోనన్న భయంతో విలాస్ రావు దేశ్‌ముఖ్ బాగా ఆందోళన చెందారని, అప్పట్లో రూ. 50 లక్షలు ఇస్తే ఏ ఎమ్మెల్యే అయినా పార్టీలు మారిపోయేవారని అజిత్ పవార్ చెప్పారు. కానీ ఇప్పుడైతే ఆ మొత్తం తీసుకుని కనీసం ఒక కార్పొరేటర్ కూడా పార్టీ మారరని వ్యాఖ్యానించారు. ఇలా పార్టీలు మారిపోయే నాయకులకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వొద్దని రాజకీయ పార్టీలను ఆయన కోరారు.
మరిన్ని వార్తలు