'అందరూ వద్దంటున్నా.. సీఎం పెళ్లి నేనే చేశా'

27 Oct, 2016 16:17 IST|Sakshi
'అందరూ వద్దంటున్నా.. సీఎం పెళ్లి నేనే చేశా'
ములాయం సింగ్ యాదవ్ కుటుంబం అంతా అఖిలేష్ యాదవ్ పెళ్లిని వ్యతిరేకిస్తుంటే.. డింపుల్‌తో అతడి పెళ్లి తానే చేయించానని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ములాయం సింగ్ యాదవ్ సహచరుడు అమర్ సింగ్ చెప్పారు. అప్పట్లో అఖిలేష్ తరఫున గట్టిగా నిలబడింది తానొక్కడినేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా అతడి పెళ్లి ఫొటోలు చూస్తే.. తాను లేకుండా ఏ ఒక్క ఫొటో కూడా ఉండదని తెలిపారు. అలాంటి అఖిలేష్ యాదవ్.. ఇప్పుడు తనను 'దలాల్' అంటూ వ్యాఖ్యానించడం చూస్తే చాలా బాధాకరం అనిపిస్తోందని అమర్ సింగ్ చెప్పారు. 'ముఖ్యమంత్రి అఖిలేష్'కు తాను సన్నిహితం కాకపోవచ్చు గానీ.. ములాయం కొడుకు అఖిలేష్‌కు మాత్రం తాను ఎప్పుడూ సన్నిహితంగానే ఉన్నానని వ్యాఖ్యానించారు. తనకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ అయినా దొరుకుతుంది గానీ అఖిలేష్ అపాయింట్‌మెంట్ మాత్రం దొరకదన్నారు. తన బలితోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటే.. బలిదానం చేయడానికి తాను సిద్ధమేనని అన్నారు. 
 
రాంగోపాల్ యాదవ్ తనను బెదిరిస్తూ చేసిన ప్రకటన చూసి భయం వేస్తోందని.. తనకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారని అమర్ సింగ్ చెప్పారు. రాంగోపాల్ యాదవ్‌ను తాను ఎప్పుడూ 'నపుంసకుడు' అనలేదని, ఆయన పేరుతోను, బాలగోపాల్ అనే పేరుతో మాత్రమే పిలిచానని చెప్పారు. తానెప్పుడూ అలాంటి తిట్లు వాడలేదన్నారు. పవన్ పాండే చేతిలో దెబ్బలు తిన్నారని కథనాలు వచ్చిన అషు మాలిక్‌ను తాను ఎప్పుడూ కలవలేదని అమర్ తెలిపారు. శివపాల్ యాదవ్‌కు బదులు అఖిలేష్‌ను సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించినప్పుడు కూడా తననే అందరూ తప్పుబట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు శివపాల్ యాదవ్ మాత్రం తనను తప్పుబట్టకుండా, కొత్త అధ్యక్షుడైన అఖిలేష్‌ను పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానించారన్నారు. 
 
ఇక నవంబర్ 3వ తేదీ నుంచి అఖిలేష్ యాదవ్ నిర్వహించనున్న రథయాత్రకు తనకు ఆహ్వానం లేదని.. అలాంటప్పుడు తాను అక్కడకు వెళ్తే అఖిలేష్ మద్దతుదారులు తన దుస్తులు చింపి, కొట్టడం ఖాయమని అమర్ సింగ్ చెప్పారు. అప్పుడు అనవసరంగా అఖిలేషే తనను కొట్టించాడన్న ఆరోపణలు వస్తాయని, అందువల్ల ఆ రథయాత్రకు తాను వెళ్లడం లేదని తెలిపారు. 
మరిన్ని వార్తలు